హెచ్1బీలో మళ్లీ మార్పులు.. తక్కువ వేతనం ఉంటే ఇక కష్టమే!

ABN , First Publish Date - 2020-10-29T13:38:14+05:30 IST

విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం జారీచేసే హెచ్1బీ వీసాలలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ

హెచ్1బీలో మళ్లీ మార్పులు.. తక్కువ వేతనం ఉంటే ఇక కష్టమే!

వాషింగ్టన్: విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం జారీచేసే హెచ్1బీ వీసాలలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ మార్పులు చేపట్టింది. హెచ్1బీ గెస్ట్ వర్కర్ ప్రోగ్రాంలో మార్పులు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. అధిక వేతనం కలిగిన ఉద్యోగుల దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చేలా ఈ ప్రోగ్రాంలో మార్పులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అమెరికా టెక్ కంపెనీలు అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీయులను ఉద్యోగంలోకి పెట్టుకుంటున్నాయంటూ ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. విదేశీయులకు అవకాశాలను కల్పిస్తూ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలకు గండి కొడుతున్నాయని ఆయన చెబుతూ వచ్చారు. ‘అమెరికన్స్ ఫస్ట్’ అన్న నినాదంతో ట్రంప్ హెచ్1బీ వీసా జారీలో అనేక మార్పులు చేపడుతూ వచ్చారు. ఈ ప్రభావం విదేశీయులు.. ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా పడింది. ఇక తాజాగా చేసిన మార్పులతో తక్కువ వేతనం కలిగి ఉన్న విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండబోతున్నాయి. 


అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా లాటరీ పద్దతిలో విదేశీయులకు 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది. తాజా ప్రతిపాదనలతో లాటరీ సిస్టమ్‌కు స్వస్తి చెప్పి హెచ్1బీ దరఖాస్తులను నాలుగు లెవల్స్‌గా విడదీయనున్నారు. అధిక వేతనం కలిగి ఉన్న ఉద్యోగుల దరఖాస్తులు నాలుగో లెవల్‌లో ఉంటాయి. ఆ తరువాత వేతనం స్థాయిని బట్టి మూడో లెవల్, రెండో లెవల్ ఉంటాయి. తక్కువ వేతనం ఉన్న వారి దరఖాస్తులు మొదటి లెవల్‌లో పెడతారు. ఇక హెచ్1బీ వీసాకు నాలుగో లెవల్‌లో ఉన్న వారు ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారు దరఖాస్తు చేసుకున్న తరువాత ఈ ప్రక్రియ మూడో లెవల్‌కు.. ఆ తరువాత రెండు, మొదటి లెవల్‌కు వెళ్తుంది. ఈ లెక్కన అత్యధిక వేతనంతో ఉన్న దరఖాస్తులకు ఎక్కువ వీసాలు జారీ అయ్యే అవకాశం ఉంటుందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. 


ఇదే సమయంలో అమెరికన్ల ఉద్యోగాలను కూడా కాపాడినట్టు అవుతుందని అంటున్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వివరాల ప్రకారం.. 2019 ఆర్థిక సంవత్సరంలో 60 శాతం హెచ్1బీ వీసాలు తక్కువ వేతనం కలిగి ఉన్న విదేశీ ఉద్యోగులకే దక్కాయి. తాజా మార్పులతో నాలుగు, మూడో లెవల్‌లో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం కలుగుతుందని, మొదటి లెవల్‌లోని దరఖాస్తులకు హెచ్1బీ జారీ చేయడం తగ్గుతుందని తెలిపారు. దీనిద్వారా కంపెనీలు అమెరికన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరిస్తూ అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటానికి ట్రంప్ ప్రభుత్వం చేసిన మరో దార్శనిక చర్య ఇది అని హోంల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ బుధవారం తెచ్చిన ప్రతిపాదనను అమలు చేసే ముందుగా పరిశీలన కోసం పబ్లిక్ కామెంట్ పీరియడ్‌ కింద 30 రోజుల పాటు ఉంచనున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం హెచ్1బీ ప్రక్రియకు ముందే దీన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. కాగా.. ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకు హెచ్1బీ వీసాల జారీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-10-29T13:38:14+05:30 IST