ఈ వ్యూహంతోనే కరోనాకు చెక్ పెట్టిన చైనా.. మరి అమెరికాకు సాధ్యమేనా..?
ABN , First Publish Date - 2020-04-01T23:34:05+05:30 IST
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 199 దేశాల్లో విళయతాండవం చేస్తోంది.

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 199 దేశాల్లో విళయతాండవం చేస్తోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా బారి నుంచి ఎలా బయట పడాలో తెలియక సతమతమవుతోంది. వైరస్ వ్యాప్తి మొదలైన వెంటనే కఠిన చర్యలు తీసుకున్న చైనా.. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. అదే తరుణంలో అమెరికాలో మాత్రం కేసుల తీవ్రత విపరీతంగా ఉంటోంది. మరి అమెరికా కూడా చైనా ప్రభుత్వం మాదిరిగా కఠిన చర్యలు తీసుకుని కరోనాకు చెక్ పెడుతుందా..? కరోనాను నియంత్రించేందుకు చైనా ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసింది..? అమెరికాలో ఆ వ్యూహాన్ని అమలు చేయడం సాధ్యమేనా? కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ‘చైనా వ్యూహం’.. అమెరికాలో ఎంత మేరకు ఫలిస్తుంది..? చైనా ప్రభుత్వానికి సీనియర్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న హియావ్ వాంగ్ అమెరికాకు ఏం సలహా ఇస్తున్నారు? అమెరికా ఎన్ని చర్యలు తీసుకున్నా రెండు నెలల పాటు నిత్యం 100 మంది మరణిస్తూనే ఉంటారని చెప్పిందెవరు..?
కరోనాను చైనా ఎలా ఎదుర్కొందంటే..
చైనాలోని హుబే ప్రావిన్స్‌లో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. 55 ఏళ్ల వ్యక్తి వూహాన్‌లోని జంతువులను విక్రయించే మార్కెట్‌కు వెళ్లగా.. ఒక జంతువు నుంచి కరోనా సోకినట్టు రిపోర్ట్ చెబుతోంది. ఈ వ్యక్తి నుంచి కొద్ది రోజుల్లోనే వేల మందికి వైరస్ వ్యాపించేసింది. వెంటనే రంగంలోకి దిగిన చైనా ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలను జారీ చేసింది. వైరస్ సోకిన వారి సంఖ్య వేలకు చేరడంతో.. కేవలం పదే పది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించగలిగింది. కరోనా సోకిన వారిని, లక్షణాలు కలిగిన వారితో పాటు మిగతా వారికి కూడా పరీక్షలు చేసింది. వేరే దేశాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి వైద్యుల కొరతను తగ్గించింది. స్థానిక అధికారుల ద్వారా ప్రతి ఇంట్లో హెల్త్ చెక్ చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారిని, కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిన వారిని బలవంతంగా క్వారంటైన్లను తరలించింది. ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్నప్పటికి.. కరోనాను నియంత్రించేందుకు పిల్లల నుంచి తల్లిదండ్రులను దూరం చేసింది. అపార్ట్‌మెంట్లలో కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్న వారిని తాత్కాళిక సెక్యూరిటీ గార్డ్స్‌గా మార్చింది. వీరి ద్వారా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు ఎవరు వస్తున్నారు.. లోపలకు ఎవరు వెళ్తున్నారనేది స్పష్టంగా తెలిసేలా చేసింది.
క్యూ ఆర్ స్కాన్ చేస్తేనే.. నిత్యావసర వస్తువులు
ప్రస్తుతం భారత్‌తో సహా.. చాలా దేశాలు నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు ప్రజలను బయటకు అనుమతిస్తున్నాయి. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లోనే.. అయితే చైనా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. అన్ని దేశాల మాదిరిగా ప్రజలు నిత్యం సూపర్ మార్కెట్లకు వెళ్లే అనుమతిని.. చైనా ప్రభుత్వం ఇవ్వలేదు. వారానికో, పది రోజులకో ఒక్కసారి మాత్రమే స్థానికంగా ఉండే సూపర్ మార్కెట్లకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అది కూడా క్యూ ఆర్ కోడ్ సిస్టమ్‌తో అమలు చేసింది. చైనా ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. చైనాలో స్మార్ట్‌ఫోన్‌ను వాడే ప్రతి ఒక్కరు ఈ యాప్‌ను తప్పకుండా తమ ఫోన్లలో వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాప్ ద్వారా చైనీయులకు మూడు రంగుల కోడ్‌లను ఇచ్చారు. గ్రీన్, రెడ్, ఎల్లో ఇలా మూడు రంగుల క్యూ ఆర్ కోడ్‌లు ఉంటాయి. వీటిలో గ్రీన్ కలర్ క్యూ ఆర్ కోడ్ వస్తేనే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి ఉంటుంది. మిగతా రెండు కలర్స్‌లో ఏది వచ్చినా స్థానిక అధికారులు వారిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. వారిని బయటకు రానివ్వకుండా చూస్తారు.


అమెరికాలో ఇలాంటి ఆంక్షలు అమలు చేయడం సాధ్యమేనా?
కరోనాను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి చిన్న పిల్లలను కూడా వేరు చేసింది. ఆ సమయంలో ఇది కఠిన చర్యగా అనిపించినప్పటికి కరోనా వ్యాప్తిని చూస్తే ఇలా చేయడాన్ని ఎవరూ తప్పుగా భావించరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య దాదాపు లక్షా 90 వేలకు చేరింది. మరణించిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. చైనా చేసిన విధంగానే అమెరికా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించి.. ఈ మహమ్మారి నుంచి బయటపడాలని అగ్రరాజ్య పౌరులు, మేథావులు ఆశిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితి చాలా బాధాకరమని చైనా ప్రభుత్వానికి సీనియర్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న వాంగ్ అన్నారు. చైనా చేసిన విధంగానే అమెరికా కఠిన ఆంక్షలు విధించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అదుపులోకి రావడం చాలా కష్టమని వాంగ్ అభిప్రాయపడ్డారు.
కరోనా విజృంభనను చైనా.. ప్రారంభ దశలో గుర్తించకపోయినా.. వ్యాప్తి చెందుతున్నప్పుడు గుర్తించి.. వెన్వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. కనీసం ఇప్పుడైనా చైనా అమలు చేసిన వ్యూహాన్ని అనుసరిస్తే.. కొద్ది నెలల్లోనైనా కరోనా బారి నుంచి కోలుకోవచ్చు. అయితే వివిధ సంస్కృతులు, రాజకీయ భావాలు కలిగి ఉన్న అమెరికాలో కఠిన ఆంక్షలు విధించడం అంత సులువైన పని కాదని వాంగ్ చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం భౌతిక దూరాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న స్టేడియాలు, ఎగ్జిబిషన్ హాళ్లను క్వారంటైన్ సెంటర్ల కింద మార్చాలన్నారు. కరోనా లక్షణాలున్న వారందరిని క్వారంటైన్ సెంటర్లకు తక్షణమే తరలించాలన్నారు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికి.. తప్పకుండా పనిచేస్తుందన్నారు.

ఆంక్షలను పట్టించుకోకుండా బయట తిరుగుతున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారిని కూడా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండేలా చేసింది. ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా.. మరే ఇతర అత్యవసర పరిస్థితి అయినా.. ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. దాని ద్వారా ప్రజల సమస్యలను తీర్చుతూ వచ్చింది. దీంతో పాటు కరోనా బారిన పడి ఎవరైనా మరణిస్తే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే.. కుటుంబ సభ్యులు చివరి సారి దూరం నుంచే చూసేందుకు అనుమతినిచ్చింది. ప్రభుత్వమే సురక్షిత వాతావరణంలో కరోనా మృతులకు అంత్యక్రియలు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆ దేశ ప్రజలంతా.. చైనా ప్రభుత్వానికి సహకరించడం మరో ఎత్తు.. కఠిన ఆంక్షలు విధిస్తున్నప్పటికి.. ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తుందని చైనీయులంతా నమ్మారు. ఈ కారణంగానే వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సెల్ప్ ఐసోలేషన్‌లో ఉంటూ వచ్చారు. ప్రజల సహకారంతోనే చైనా.. కరోనాను గెలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అమెరికా ప్రభుత్వం కరోనాను నియత్రించగలదా?
ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి కరోనా అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదనే చెప్పాలి. ఇప్పటికీ అమెరికాలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే లాక్‌డౌన్ నడుస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. అధిక కేసులు న్యూయార్క్‌లోనే నమోదవుతున్నా.. ఆర్థిక రంగం మొత్తం న్యూయార్క్‌పైనే ఆధారపడి ఉండటంతో లాక్‌డౌన్ విధించలేని పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ప్రభుత్వం కరోనాపై ఆంక్షలు తీసుకునే హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ఈ కారణంగానే అమెరికా వ్యాప్తంగా ఒకే రకమైన ఆంక్షలు అమలులో లేవు. చైనా విషయానికి వస్తే ప్రభుత్వం దేశం మొత్తం ఒకే రకమైన ఆంక్షలను విధించింది. ఇదే సమయంలో ప్రజలు కూడా కలిసికట్టుగా ప్రభుత్వ ఆంక్షలను అనుసరిస్తూ వచ్చారు. అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుండంతో ట్రంప్ ప్రభుత్వం కరోనాను అదుపులోకి తీసుకురాలేకపోతోంది. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఎప్పుడైతే కరోనా కేసు నమోదైందో.. ప్రభుత్వం ఆ క్షణమే ఆ ప్రావిన్స్ నుంచి రాకపోకలను నిషేధించింది. హుబే నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదు.. బయట నుంచి ఎవరూ లోపలకు రాకూడదంటూ ఆంక్షలు పెట్టి చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దింది. మరి న్యూయార్క్ ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలను అమలు చేస్తోందా అంటే లేదు. కరోనా సోకిన వారు ఇప్పటికీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు తిరుగుతూనే ఉన్నారు. ఇదే అమెరికాలో కరోనా విజృంభనకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్టడీలో ఏం తేలిందంటే..
అమెరికా అధ్యక్షుడు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈస్టర్ నాటికి కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో కరోనా పరిస్థితిపై యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఓ స్టడీ నిర్వహించింది. ఈ స్టడీ ద్వారా ఏం తెలిసిందంటే.. అమెరికాలో జూన్ నెల మొదలయ్యే వరకు నిత్యం మరణించే వారి సంఖ్య వంద తగ్గదని తెలిసింది. అంటే.. అమెరికాలో మరో రెండు నెలల పాటు నిత్యం కనీసం 100 మంది మరణిస్తూనే ఉంటారన్నమాట. ప్రజలు బయటకు రాకుండా ఉండేలా అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలను అమలుచేసినట్టు కనిపించలేదు. చైనా తరువాత అమెరికా దేశం, యూరప్ ఖండాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రజలు బయటకు రాకుండా ఇటీవల కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. అవసరం లేకుండా బయటకు వస్తే ఫైన్లు విధించడం, అరెస్ట్ చేసే విధంగా పోలీసులకు కొత్త అధికారాలను అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం కూడా ఇటువంటి విధంగా కఠిన ఆంక్షలు విధిస్తే తప్ప కరోనాను నియంత్రించడం సాధ్యం కాదంటూ విశ్లేషకులు చెబుతున్నారు.