జాత్యహంకారానికి వ్యాక్సిన్ లేదు: కమలా హ్యారిస్

ABN , First Publish Date - 2020-08-21T01:55:05+05:30 IST

జాత్యహంకారానికి వ్యాక్సిన్ లేదంటూ డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్

జాత్యహంకారానికి వ్యాక్సిన్ లేదు: కమలా హ్యారిస్

వాషింగ్టన్: జాత్యహంకారానికి వ్యాక్సిన్ లేదంటూ డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ అన్నారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో డెమొక్రట్లు కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఇక ఈ సదస్సులో ఆమె జాత్యహంకారం అనే అంశంపై ప్రధానంగా మాట్లాడారు. అమెరికాలో ఇటీవలి కాలంలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయులను గుర్తుచేస్తూ జాత్యహంకారానికి ముగింపు పలకాలని అన్నారు. అందరూ స్వేచ్ఛగా బతికేంత వరకు ఏ ఒక్కరికి స్వేచ్ఛ వచ్చినట్టు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. జాత్యహంకారానికి వ్యాక్సిన్ లేదని.. అందరికి ఒకేలా న్యాయం జరగాలనే హామీని నెరవేర్చేందుకు డెమొక్రట్లు అందరూ కలిసి పనిచేయాలని కమలా హ్యారిస్ తెలిపారు. ఇక ఇదే సదస్సులో కమలా హ్యారిస్ మహిళల హక్కుల కోసం పోరాడిన వారితో పాటు తన తల్లిని కూడా గుర్తుచేసుకున్నారు. కమలా హ్యారిస్ తల్లి 2009లో కేన్సర్ బారిన పడి మరణించారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా జీవితం యొక్క అర్థం తెలుస్తుందని తన తల్లి చెప్పినట్టు కమలా హ్యారిస్ గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా తాను నామినేట్ అవడాన్ని తన తల్లి చూడాలని కోరుకున్నానని చెబుతూ కమలా హ్యారిస్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి తనతో పాటు లేనప్పటికి పైనుంచి ఆమె తనను ఎప్పుడూ చూస్తూనే ఉంటుందని అన్నారు. తాను 25 ఏళ్ల వయసులో తల్లిని అయ్యాయని.. నేడు ఇలా అందరి ముందు ఉపాధ్యక్ష అభ్యర్థిగా మాట్లాడతానని ఆరోజు తన తల్లి కూడా ఊహించి ఉండదని కమలా హ్యారిస్ చెప్పారు. 

Updated Date - 2020-08-21T01:55:05+05:30 IST