ఇక్కడి ఆచారాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2020-03-04T07:44:26+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరిగినప్పటికి.. కొన్ని దేశాల్లో మాత్రం పురాతనమైన వింత ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. వాటిలో దక్షిణ ఇథియోపియాలోని లేక్

ఇక్కడి ఆచారాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

అడిస్ అబాబా: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరిగినప్పటికి.. కొన్ని దేశాల్లో మాత్రం పురాతనమైన వింత ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. వాటిలో దక్షిణ ఇథియోపియాలోని లేక్ తర్కానా, లోవర్ ఒమో వ్యాలీ ఒకటి. ఇక్కడ సుర్మా అనే జాతి ఉంది. ఈ సుర్మా ప్రజల్లో మళ్లీ ముర్సి, సురి, మేకన్ అనే మూడు తెగలు ఉంటాయి. వీరిలో ముర్సి, సురి ఒకే రకమైన సంస్కృతిని పాటిస్తూ వస్తాయి. ప్రపంచంలో ఆడవారి అందాన్ని వివిధ రకాలుగా పోలిస్తే.. ఇక్కడి వారు మాత్రం ఆడవారి అందాన్ని లిప్ ప్లేట్‌తో పోలుస్తారు.


లిప్ ప్లేట్ అంటే ఏంటంటే.. ఇక్కడి ప్రాంతాల్లో జీవించే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మట్టి లేదా చెక్కతో ప్లేట్లను తయారుచేస్తారు. ఈ ప్లేట్ల సైజు నాలుగు నుంచి 25 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అమ్మాయిలు యుక్తవయసుకు రాగానే.. వారి పెదవుల్లో కింద పెదవిని కట్ చేస్తారు. దీనికంటే ముందు కింద వరుసలో ముందు కనిపించే నాలుగు పళ్లను తీసేస్తారు. ఇలా చేసిన తరువాత వారి పెదవి మధ్య ఈ ప్లేట్లను పెడతారు. మొదటగా నాలుగు సెంటీమీటర్ల సైజు కలిగి ఉన్న ప్లేటును పెడతారు. అక్కడి నుంచి రోజురోజుకూ కింద పెదవి విస్తరించేందుకు.. ప్లేటు సైజు పెంచుకుంటూ వెళ్తారు. 


ఇలా చేయడానికి కారణమేంటి?

ఈ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లి చేసే ముందు ఇద్దరి తల్లిదండ్రులు ముందుగా అమ్మాయి పెదవులనే చూస్తారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం.. అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులు కట్నం కింద పశువులను ఇస్తారు. అయితే ఈ కట్నాన్ని ఎలా ఇస్తారంటే.. అమ్మాయి పెదవుల మధ్య ఎంత పెద్ద సైజు ప్లేటు సరిపోతే.. అన్ని ఎక్కువ పశువులు అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి కుటుంబం నుంచి కట్నం కింద వస్తాయి. చిన్న ప్లేటు అయితే 40 పశువులను.. పెద్ద ప్లేటు అయితే 60 పశువులను ఇస్తుంటారు. అమ్మాయి పెదవుల మధ్య పెద్ద ప్లేటు సరిపోయిందంటే.. ఆమెను అదృష్టవంతురాలిలా చూస్తారు.


ఈ కారణంగా ఇక్కడి అమ్మాయిలు తమ పెదవుల మధ్య పెద్ద సైజు ప్లేటు సరిపోయేలా కసరత్తులు చేస్తూనే ఉంటారు. ఇలా ఇక్కడి అమ్మాయిలు ప్లేటు సంస్కృతిని ఇప్పటికి కొనసాగిస్తూనే ఉన్నారు. మరోపక్క వీరిని పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా కొన్ని సంస్కృతులను అనుసరిస్తున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయి ముందుగా వేరొకరితో కర్రసాము యుద్దం చేసి గెలవాల్సి ఉంటుంది. అలా యుద్దంలో గెలిచిన అబ్బాయికే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. 

Updated Date - 2020-03-04T07:44:26+05:30 IST