భయం అక్కర్లేదు.. ట్రంప్ నిర్ణయంతో మనకొచ్చిన ఇబ్బందేమీ లేదు..
ABN , First Publish Date - 2020-04-28T13:15:41+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గ్రీన్‌కార్డుల జారీని 60 రోజుల పాటు రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడంతో నగర ఐటీ కంపెనీలతో పాటుగా డాలర్ డ్రీమ్స్‌లో ఉన్న ఎంతోమంది ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొవిడ్-19, లాక్‌డౌన్ కష్టాలతో ఎలా గట్టెక్కాలోనంటూ ఒత్తిడిలో ఉన్న ఐటీ సంస్థలు, ఉద్యోగులకు ఈ పరిణామంతో మరింత ఒత్తిడికి లోనవుతున్నారు.

అమెరికా వీసా రూల్స్ ప్రభావం తాత్కాలికమే..
అధ్యక్ష ఎన్నికల కోణంలోనే చూడాలి.. ఐటీ నిపుణుల విశ్లేషణ
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గ్రీన్‌కార్డుల జారీని 60 రోజుల పాటు రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడంతో నగర ఐటీ కంపెనీలతో పాటుగా డాలర్ డ్రీమ్స్‌లో ఉన్న ఎంతోమంది ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొవిడ్-19, లాక్‌డౌన్ కష్టాలతో ఎలా గట్టెక్కాలోనంటూ ఒత్తిడిలో ఉన్న ఐటీ సంస్థలు, ఉద్యోగులకు ఈ పరిణామంతో మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే, భయపడాల్సిన అవసరమే లేదని.. ప్రతిభావంతులకు నష్టమేమీ ఉండదని ఐటీ రంగ నిపుణులు భరోసా ఇస్తున్నారు. హెచ్1బీ, ఎల్ 1 వీసాలను ఎక్కువగా తీసుకునే భారతీయులకు ఇది ఇబ్బంది కాబోదని అంటున్నారు.
స్వల్పకాలిక ప్రభావమే
మనదేశంలో ఐటీ సేవలు ఎక్కువగా ఔట్‌సోర్సింగ్ తరహాలోనే ఉంటాయి. అదీ ప్రధానంగా అమెరికా లాంటి చోట్ల తమ ఖాతాదారులకు సేవలందించడంపైనే ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుని సాఫ్ట్‌వేర్ రూపొందించడంతో పాటుగా ఆన్‌సైట్‌లో కొద్ది మంది ఉద్యోగులను నియమించి తాము నిర్మించిన సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్‌ను పనిచేసేలా చేస్తుంటారు. ఈ ఆన్‌సైట్ ఉద్యోగాలకోసం వెళ్లే ఉద్యోగుల కోసం హెచ్1 బీ వీసాలను ఇప్పటికే నియంత్రించారు. పైగా వీసా ఫీజులు, మినియం వేజ్ గ్యారెంటీ వంటివి కంపెనీలకు తలకు మించిన భారం అవుతున్నాయనే వాదనలూ ఉన్నాయి. అయినప్పటికీ మన దేశం నుంచి 2021 సంవత్సరం కోసం 1.85 లక్షల హెచ్1 వీసా అభ్యర్థనలు అమెరికా ఎంబసీలకు వచ్చాయి. నిజానికి యూఎస్ అందుకున్న మొత్తం అప్లికేషన్‌లలో ఇది 67శాతం. ఇవి కాకుండా బీ1/బీ2 వీసాల కోసమూ చాలామంది అప్లయ్ చేసుకున్నారు.
స్వల్పకాలంలో వీరికి కాస్త కష్టం కావొచ్చు కానీ దీర్ఘకాలంలో వీరికి వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు మరి కొంత మంది నిపుణులు. కొవిడ్ వల్ల ఇతర దేశాల పర్యటనలపై ఆంక్షలుంటాయన్న అంచనాల నేపథ్యంలో ఈ నిబంధనలు ఇబ్బందులను పెంచనున్నాయని, కాకపోతే అది స్వల్పకాలమే అని అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ ఐటీకి అశనిపాతం?
ట్రంప్ అమల్లోకి తెచ్చిన వీసా నిబంధనలు అమెరికా ప్రజలకు తీసుకువచ్చిన భరోసా ఏమిటో తెలీదు కానీ భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగువారికి మాత్రం లేనిపోని భయాలను ఆయన కలిగించారన్నది ఐటీ నిపుణుల అభిప్రాయం. కొవిడ్-19 దెబ్బకు ఇప్పటికే ఐటీ రంగం కుదేలయిందని, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు తప్ప కొత్తగా ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కాస్త కష్టమేనంటూ, యూఎస్ దారిలోనే యూరోప్ దేశాలు కూడా భావిస్తే అది మన నగర ఐటీ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని అంటున్నారు. ‘ట్రంప్ చేష్టలను సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ ఎత్తేయాలనే అమెరికన్ల ఆందోళనలు... వెరసి ఈ ఆర్డర్ వచ్చింది. దీంతో మనకు వచ్చిన పెద్ద ఇబ్బందేమీ లేదు’ అని ఓ ఐటీ సంస్థ సీఈవో అన్నారు. ట్రంప్ చర్యలను తేలిగ్గా తీసేయడానికి లేదని మరికొందరు ఐటీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. యూరోప్ దేశాలు కూడా ఇలాగే ఆలోచిస్తే ఇబ్బందేనన్నారు. ప్రస్తుతానికి ఇమ్మిగ్రెంట్ వీసాలకే పరిమితం అని ట్రంప్ అన్నా ఇక ముందు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకూ వర్తింపజేయరనే నమ్మకం ఏదని ప్రశ్నిస్తున్నారు.
కచ్చితంగా ప్రభావం ఉంటుంది
హెచ్1బీ, ఎల్1 వీసాలతో అమెరికా వెళ్లాలనుకునే వారిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే వర్క్ పర్మిట్ ఉండి, అమెరికాలో తమ వర్క్ కొనసాగించాలనుకునే వారిపై ఇది ప్రభావం చూపదు. - దినేశ్ చంద్రశేఖర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, పాక్టెరా ఎడ్జ్
భయపడాల్సిన పనిలేదు
ఇమ్మిగ్రెంట్ వీసా అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ కార్యకలాపాలు సాగించాలనుకునే విదేశీయుల కోసం నిర్దేశించింది. హెచ్1, బీ1/2, ఎల్1/2 తోపాటుగా మరెన్నో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కిందకు వస్తాయి. కాబట్టి మనమీద పెద్దగా ప్రభావం ఉండదు. భయపడాల్సిన పని లేదు. -సురేంద్ర మోహన్, డైరెక్టర్, సురేన్స్ ఇన్ఫోటెక్
స్థానికులను ఆకర్షించేందుకే
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం భారీ కుదుపు అని నేననుకుంటున్నాను. అయితే అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది శ్రేయస్కరం కాదు. ఆ దేశం నేడు సూపర్‌పవర్‌గా ఉందంటే కారణం.. ప్రతిభావంతులను ఆకర్షించడమే. అమెరికాలో అసాధారణ స్థాయికి చేరుకున్న వారిలో ఎక్కువమంది ఇమ్మిగ్రెంట్సే. రానున్న అధ్యక్ష ఎన్నికలతో పాటు దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన చేశారని అనుకుంటున్నాను. -పంకజ్ దివాన్, సీఈవో, ఐడియాల్యాబ్స్ ఫ్యూచర్ టెక్ వెంచర్స్