పౌర విమానయాన శాఖ అనుమ‌తి కోసం తెలుగు ఎన్నారైల ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-07-02T17:55:33+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంలో వేలాది మంది ఎన్నారైలు భార‌త్‌లోనే చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే.

పౌర విమానయాన శాఖ అనుమ‌తి కోసం తెలుగు ఎన్నారైల ఎదురుచూపులు

హైద‌రాబాద్ నుంచి యూఏఈ వెళ్లేందుకు 162 మంది ఎన్నారైల ప్ర‌య‌త్నం

చార్టర్డ్ ఫ్లైట్‌ అద్దెకు తీసుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతి కోరుతున్న‌ ఎన్నారైలు

హైద‌రాబాద్: మ‌హ‌మ్మారి క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంలో వేలాది మంది ఎన్నారైలు భార‌త్‌లోనే చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఇలాగే హైద‌రాబాద్‌కు చెందిన సుమారు 162 మంది ఎన్నారైలు వివిధ ప‌నుల నిమిత్తం యూఏఈ నుంచి స్వ‌దేశానికి వ‌చ్చి ఇరుక్కుపోయారు. దాంతో తిరిగి యూఏఈ వెళ్లేందుకు ప్ర‌త్యేక విమానం అద్దెకు తీసుకోవ‌డానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతి కోరుతున్నారు. ఇప్ప‌టికే ఈ 162 మంది ఎన్నారైల‌కు యూఏఈ ఇమ్మిగ్రేషన్ నుంచి ఆమోదం ల‌భించింది. అది కూడా కేవలం 21 రోజులు మాత్రమే చెల్లుతుంది. అంటే జూలై 4 తర్వాత వారు ఆ దేశంలోకి ప్రవేశించలేరు. కానీ ఇప్ప‌టికీ అనుమ‌తి దొర‌క‌క‌పోవ‌డంతో వారు గ‌డువులోగా తిరిగి యూఏఈ వెళ్తామో లేదో అని భయాందోళ‌నకు గుర‌వుతున్నారు.


ఈ విష‌య‌మై అబుధాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేష‌న్... తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ ఎన్నారైల‌ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిందిగా లేఖ రాసింది. రాష్ట్రంలో చిక్కుకున్న ఎన్నారై కుటుంబాలు ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభ వేళ‌ యూఏఈలో త‌మ ఉద్యోగాలు ఉంటాయో? ఊడిపోతాయో? తెలియ‌ని అయోమ‌య స్థితిలో ఉన్నాయ‌ని, గడువులోగా వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి యూఏఈకి తిరిగి పంపించాల‌ని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేష‌న్ త‌న లేఖ‌లో పేర్కొంది. మ‌రోవైపు తెలంగాణ‌లో విజృంభిస్తున్న మహమ్మారి వ‌ల్ల అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 17వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. 250 మందికి పైగా మ‌ర‌ణించారు.   

Updated Date - 2020-07-02T17:55:33+05:30 IST