విదేశీ వ్యవహారాల సహాయమంత్రి‌తో తెలుగు ప్రవాసీయుల సమావేశం

ABN , First Publish Date - 2020-12-18T00:42:23+05:30 IST

ల్ఫ్ దేశాల నుంచి తిరిగి స్వదేశానికి వస్తున్న ప్రవాసీయులకు పునరవాసం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆవకాశాలను పరిశీలిస్తోందని

విదేశీ వ్యవహారాల సహాయమంత్రి‌తో తెలుగు ప్రవాసీయుల సమావేశం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాల నుంచి తిరిగి స్వదేశానికి వస్తున్న ప్రవాసీయులకు పునరవాసం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆవకాశాలను పరిశీలిస్తోందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి కె.మురళీధరన్ వెల్లడించారు. ఒమాన్ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం రాత్రి భారత ప్రవాసీ మంచ్ అనే ప్రవాసీయుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్ఫ్, భారతదేశ వర్తమాన పరిస్ధితులపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. భారత్‌కు తిరిగి వస్తున్న ప్రవాసీయులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలని, అప్పుడే వారికి పునరావాసం కల్పించడం సులువవుతుందని ఆయన అన్నారు. ఒమాన్, ఇతర గల్ఫ్ దేశాలతో సన్నిహిత సంబంధాలను పటిష్ఠం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. 


ఒమాన్ అభివృద్ధిలో నాటి నుంచి నేటి వరకు ఒమాన్‌తో కలిసి భారత్ అడుగులు వేస్తోందని మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. రైతులకు ప్రొత్సహకరమైన వాతవారణం కల్పించడానికి ఉద్దేశించిన చట్టాలను ప్రతిపక్షాలు తప్పుగా ప్రచారం చేయించి రైతులు నిరసన ప్రదర్శనలు చేసేలా ఉసిగొల్పుతున్నాయని మురళీధరన్ అరోపించారు. విశాల మండీలతో రైతులకు ప్రొత్సాహం లభిస్తుందని, వారి పంటలు విదేశాలకు కూడా ఎగుమతి అయ్యే ఆవకాశం ఉందని ఆయన అన్నారు. భారతదేశంలో బీజేపీ ఆదరణ ముందు ఏ ఇతర పార్టీలు నిలువలేకపోతున్నాయని, అందుకు పంచాయతి నుంచి పార్లమెంటు వరకు జరుగుతున్న ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే నిదర్శనమని మంత్రి చెప్పారు. కేరళలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో కూడా గతంలో కంటే మెరుగైన ఫలితాలను తమ పార్టీ నమోదు చేసిందని ఆయన గణంకాలతో సహా ప్రస్తావించారు.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వస్తున్న మహిళల్లో చాలా మంది మోసపోతున్నారని, వారిని సురక్షిత విధానం ద్వారా రిక్రూట్‌మెంట్ చేసేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మురళీధరన్ అన్నారు. అమ్నెస్టి సందర్భంగా ఒమాన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు తిరిగి వెళ్లాలనుకొంటున్న ప్రవాసీయులకు విమాన టిక్కెట్లు ఇచ్చి ఆదుకోవాలని పన్నీరు నరేంద్ర చేసిన విజ్ఞప్తిపై ప్రతిస్పందిస్తూ అర్హులైన వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. హైద్రాబాద్‌కు విమానాల సంఖ్య పెంచాలని చేసిన నరేంద్ర చేసిన అభ్యర్ధనను కూడా మంత్రి పరిశీలిస్తామన్నారు. కాగా.. మంత్రి మురళీధరన్‌ను కలిసిన తెలుగు ప్రవాసీయుల బృందంలో వడ్లపాటి మురళీ, మంచికట్ల కుమార్, కాష వేమన్ కుమార్, మామిడి శ్యాంలు ఉన్నారు.

Updated Date - 2020-12-18T00:42:23+05:30 IST