ఆకాశ ప్రసవం.. ప్రపంచమంతా సంచలనం

ABN , First Publish Date - 2020-10-14T12:07:14+05:30 IST

గాలిలో వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానం.. అంతలోనే కెవ్వుమని కేక.. ఆ పసిగుడ్డుకు తెలియదు.. తాను గాలిలో జన్మించానని..

ఆకాశ ప్రసవం.. ప్రపంచమంతా సంచలనం

గాలిలో వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానం.. అంతలోనే కెవ్వుమని కేక.. 

ఆ పసిగుడ్డుకు తెలియదు.. తాను గాలిలో జన్మించానని..

ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే లభించే అత్యంత అరుదైన అవకాశమని. 

కొన్ని గంటల ముందు- తల్లికి కూడా తెలియదు.. తాను ప్రసవించబోతున్నానని..

ఆ విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్‌ శైలజకు కూడా తెలియదు. 

తాను తన వృత్తి జీవితంలోనే అత్యంత కఠినమైన పురుడు పోయబోతున్నానని.. 

ఈ నెల ఏడో తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న విమానంలో జరిగిన ప్రసవం ప్రపంచమంతా సంచలనమయింది. ఆ ప్రసవం చేసింది బెంగళూరులో స్థిరపడిన మన తెలుగు డాక్టర్‌- శైలజా వల్లభనేని కావడం విశేషం. ఆమె తాను చేసిన సంచలన ప్రసవం అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.


అక్టోబర్‌ 7..బుధవారం. ఢిల్లీ నుంచి 

బెంగళూరు వెళ్లే ఇండిగో విమానంలో అందరం ఎక్కాం. కోవిడ్‌ భయంతో అందరూ చాలా టెన్షన్‌గా ఉన్నారు. కొందరు పీపీఈ సూట్లు వేసుకున్నారు. కొందరు వేసుకోలేదు. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే ప్రయాణీకుల్లో అలజడి ప్రారంభమయింది. ఎయిర్‌హోస్ట్‌సను పిలిచి ‘ఏం జరిగింది’అని అడిగాను. మోనికా అనే గర్భిణికి నొప్పులు వస్తున్నాయని.. ఆమె చాలా కంగారుపడుతోందని చెప్పింది. నాతో పాటే విమానంలో ఉన్న మరొక డాక్టర్‌- నాగరాజు వెళ్లి ఆమెను పరీక్షించారు. కానీ ఆయన గైనకాలజిస్ట్‌ కాదు. ఇంతలో క్రూ - ‘లేడీ డాక్టర్‌ 


ఎవరైనా ఉన్నారా?’ అని అడిగారు. నేను మోనికా దగ్గరకు వెళ్లి పరీక్షించా. ఆమె తీరు, చెబుతున్న లక్షణాల ఆధారంగా చూస్తే అబార్షన్‌ అవుతుందనిపించింది. కానీ మోనికా మాత్రం తనకు వచ్చినవి పురుటి నొప్పులు కాదని.. కడుపు నొప్పి అని భావించింది. ఆమెను టాయిలెట్‌కు తీసుకువెళ్లమని క్రూకి సూచించా. వారు ఆమెను టాయిలెట్‌కు తీసుకువెళ్లారు. నేను సీటులోంచి లేచి చూస్తే- నేల మీద రక్తపు మరకలు. ఒక్క క్షణం నాకు గుండె ఆగినంత పనయింది. వెంటనే టాయిలెట్‌ వైపు పరిగెత్తా. తలుపు తీసి చూస్తే- అప్పటికే మోనికాకు ప్రసవం ప్రారంభమయింది. బిడ్డ తల బయటకు వస్తోంది.


వేల అడుగుల ఎత్తులో ప్రసవం. నన్ను నేనే నమ్మలేకపోయా. వెంటనే ఆమెకు సాయం చేయటం మొదలుపెట్టా. క్షణాల్లో ప్రసవం జరిగిపోయింది. బిడ్డను చేతుల్లోకి తీసుకొని చూస్తే- ఇంకా పూర్తిగా ఎదగలేదని అర్థమయింది. నా చేతుల్లో పసిగుడ్డు ఒక్క సారి కెవ్వుమని అరిచింది. ‘హమ్మయ్య! ప్రసవం సక్రమంగా జరిగింది, బిడ్డ క్షేమంగా ఉంది’ అనిపించింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. ఈ లోపులో ప్రయాణీకుల్లో ఒకవైపు ఆందోళన. మరో వైపు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ. వారిని సమాధానపరచటానికి ఎయిర్‌హోస్టె్‌సలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ - బిడ్డ పుట్టాడని తెలిసిన వెంటనే హర్షాతిరేకాలుగా మారాయి. కొందరు ఆనందంతో చప్పట్లు కూడా కొట్టారు. 


అదృష్టం వెంట వస్తే..

సాధారణంగా ప్రసవం జరిగిన తర్వాత పసిగుడ్డు బొడ్డుతాడు కోసి ముడివేయాలి. కానీ విమానంలో దానికి అవసరమైన కత్తెర్లు, క్లాంపులు ఉండవు. పైగా కోవిడ్‌ సమయం కావటంతో శానిటైజ్‌ చేసిన కత్తెర్లనే వాడాలి కూడా! తప్పని సరి పరిస్థితులు కాబట్టి.. అందుబాటులో ఉన్న కత్తెరను శానిటైజ్‌ చేసి బొడ్డుతాడు కత్తిరించా. దానిని గాజుగుడ్డతో కట్టా! ప్రసవం అయిన వెంటనే గర్భసంచి పెద్దగా ఉంటుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఆస్పత్రిలో దీనికి అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. కానీ అవేమి లేకపోవటంతో.. చేతితోనే మోనికా పొత్తికడుపుపై మసాజ్‌ చేశా. విమానం టాయిలెట్‌ చిన్నగా ఉంటుంది. అక్కడ ఎక్కువ సేపు ఉండటం కుదరదు కాబట్టి వెంనే ఆమెను సీటు దగ్గరకు తీసుకువచ్చేశాం. సీటు మీద కొన్ని బ్యాగులు పెట్టి- ఏటవాలుగా పడుక్కోబెట్టాం. ఈ లోపులో ప్రయాణీకులు తమ వద్ద ఉన్న శాలువాలు, శానిటరీ ప్యాడ్స్‌ ఇచ్చారు. వీటన్నింటి కన్నా గొప్ప అదృష్టమేమిటంటే- రక్తస్రావాన్ని ఆపే ఇంజెక్షన్ల సెట్‌లు దొరకడం. సాధారణంగా దేశీయ విమానాల్లో ఇవి అందుబాటులో ఉండవు. కానీ ఆ ఇంజెక్షన్లను ఎవరు విమానంలో ఉంచారో తెలీదు. అవి మోనికా పాలిట ప్రాణప్రదాయనులనే చెప్పాలి. 


నేరుగా బెంగళూరుకు..

ఇదంతా ఒకవైపు జరుగుతుంటే- మరోవైపు ‘ప్రయాణం కొనసాగించాలా? లేదా మధ్యలో ఎక్కడైనా దింపాలా?’ అనే చర్చ కూడా జరుగుతోంది. కెప్టెన్‌ నాకు ఇంటర్‌కాంలో ఫోన్‌చేసి ‘హైదరాబాద్‌లో దింపాలా?’ అని అడిగారు. ‘రక్తస్రావం ఆగకపోతే- తప్పకుండా దింపాలి’ అని చెప్పాను. కానీ రక్తస్రావం తగ్గటంతో నాకు కూడా ధైర్యం వచ్చింది. పైగా మోనికాలో ఆందోళన కూడా తగ్గింది. దీనితో బెంగళూరు వెళ్లిపోవచ్చని చెప్పా. బిడ్డ ముందుగానే పుట్టేశాడు.. పైగా విమానంలో పుట్టాడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు- పిల్లలను రక్షించటానికి ‘కంగారు పద్ధతి’ అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం- బిడ్డను తల్లి ఛాతి మీద పడుక్కోబెట్టి గుడ్డలు చుట్టాలి. ఇది బిడ్డకు సహజసిద్ధమైన ఇంక్యుబేటర్‌లా తోడ్పడుతుంది. బిడ్డ శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉంచడం కోసం ఈ పద్ధతిని ఉపయోగించాం. 


సమయస్ఫూర్తి ముఖ్యం!

విమానం దిగిన వెంటనే ఎయిర్‌పోర్టు ఎయిర్‌లైన్‌ సిబ్బంది స్వాగతం పలికారు. అందరి మొహాల్లో ఆనందం. సంతోషం. ఆ వాతావరణాన్ని చూసిన వెంటనే అప్పటి దాకా పడిన కష్టమంతా మర్చిపోయా. ఈ వార్త జాతీయ మీడియాలో రావటంతో అనేక మంది ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. ‘ఆ సమయంలో ఎలా మేనేజ్‌ చేశావు? భయం వేయలేదా?’ అని అడిగారు. నిజానికి అప్పుడు భయపడే సమయం కూడా లేదు. అన్నీ వెంటవెంటనే చకచకా జరిగిపోయాయి. ఒకవేళ విమానంలో ఎక్కే సమయంలోనే దానిలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఓ ప్రయాణీకురాలు ఉందనీ, వైద్యులు అప్రమత్తంగా ఉండాలనీ తెలిసి ఉంటే.. కొంత భయం ఉండేదేమో! ప్రసవం జరుగుతోందని అర్థమవగానే విమానంలోని పీపీఈ సూట్‌, గ్లౌవ్స్‌ ధరించి వైద్యురాలిగా మారిపోయాను. అందుబాటులో ఉన్న వస్తువులు, దుస్తులనే వాడుకున్నాను.


ఆ సమయంలో నాకు నా వైద్య అనుభవంతో పాటు, సమయస్ఫూర్తి కూడా తోడ్పడిందని చెప్పాలి. నిజానికి ఏడేళ్ల విరామం తర్వాత నేను చేసిన తొలి డెలివరీ ఇది. గైనకాలజి్‌స్టనే అయినా ఫీటల్‌ మెడిసిన్‌ నిపుణురాలిగా కొనసాగుతూ ఉండడంతో కొన్నేళ్లుగా నాకు ప్రసవాలు చేసే అవసరం పడలేదు. అయినా పూర్వానుభవం ఉపయోగపడింది. ‘ఆ సమయానికి విమానంలో నేను లేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది?’ అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో తల్లిబిడ్డలకు ప్రాణహాని జరగకుండా ఉండాలంటే విమానంలో ఒక సీనియర్‌ క్రూ మెంబర్‌కు అయినా ప్రసవం చేసే పద్ధతి తెలియాలి. ఈ దిశగా విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలనేది


నా అభిప్రాయం. ఇదే విధంగా ఎయిర్‌లైన్స్‌ కూడా టికెట్‌ బుకింగ్‌ దరఖాస్తులో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక కాలమ్‌ ఏర్పాటు చేయాలి. ప్రసవానికి పుట్టింటికి వెళ్లే సంప్రదాయం మన భారతీయులది. మన దేశంలో విమానయాన సంస్థలు ఇలాంటి నియమాలు, ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.’’


వైజాగ్‌ అమ్మాయిని..

నేను పుట్టింది.. పెరిగింది వైజాగ్‌లో.  ఎంబీబీఎస్‌ తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోలార్‌లో చేశా. ఆ తర్వాత చెన్నైలో ఫీటల్‌ మెడిసిన్‌లో స్పెషలైజేష్‌ చేశా. గత ఎనిమిదేళ్ళ క్రితం బెంగుళూరులో ‘అరుణోదయ’ అనే ఆసుపత్రి ఏర్పాటు చేశా. అక్కడే ప్రాక్టీసు చేస్తున్నా. మా వారు ఉదయ్‌భాస్కర్‌ కూడా డాక్టరే! 

Updated Date - 2020-10-14T12:07:14+05:30 IST