టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ చొరవతో అబూధాబీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ కార్మికులు

ABN , First Publish Date - 2020-07-16T02:35:02+05:30 IST

యూఏఈలో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ చొరవతో

టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ చొరవతో అబూధాబీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ కార్మికులు

అబూధాబీ: యూఏఈలో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ చొరవతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానంలో తెలంగాణ కార్మికులు మంగళవారం అబూధాబీ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. కరోనా దెబ్బకు ప్రపంచదేశాల్లోని భారతీయులు ఆర్థికంగా నష్టపోయారు. ముఖ్యంగా యూఏఈలో తెలంగాణకు చెందిన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి తినడానికి తిండి లేక నానా కష్టాలు పడుతున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా అనేక మంది స్వదేశానికి చేరుకున్నా.. ఇంకా చాలా మంది యూఏఈలోనే చిక్కుకున్నారు. వీరిని కూడా స్వదేశానికి చేర్చాలన్న సంకల్పంతో టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ ముందుకొచ్చింది. యూఏఈలో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు స్వదేశానికి చేరుకోవడానికి చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేశామని టీఎఫ్ఏ అధ్యక్షుడు రాజశ్రీనివాస రావు, జీడబ్ల్యూఏసీ అధ్యక్షుడు కృష్ణ  తెలియజేశారు. 


చార్టర్డ్ విమానానికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చేందుకు టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మమేష్ బిగాల ఎంతో చొరవ చూపారని రాజశ్రీనివాసరావు, కృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల్లోని అధికారులను సంప్రదించి అన్ని అనుమతులు తెప్పించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. మరోపక్క అనుమతులు వెంటనే వచ్చేందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, ఎన్నారై సలహాదారు, మాజీ ఎంపీ కవితకు, చిట్టి బాబుకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు టీఎఫ్ఏ అధ్యక్షుడు రాజా శ్రీనివాస రావు, జీడబ్ల్యూఏసీ అధ్యక్షుడు కృష్ణ, టీఎఫ్ఏ, జీడబ్ల్యూఏసీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా జీటీడబ్ల్యూసీఏ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాసరావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-07-16T02:35:02+05:30 IST