1725 మంది రాక నేడే
ABN , First Publish Date - 2020-05-09T16:16:11+05:30 IST
వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ఊపందుకుంది. శనివారం 1725 మంది తెలంగాణ ప్ర
విదేశాల నుంచి హైదరాబాద్‌కు రానున్న తెలంగాణ వాసులు
న్యూఢిల్లీ: వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ఊపందుకుంది. శనివారం 1725 మంది తెలంగాణ ప్రజలు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు రోజూ ప్రత్యేక విమానాల ద్వారా ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు విదేశాల నుంచి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలను తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 15 వరకు 12దేశాల నుంచి 15వేల మంది భారతీయులను స్వదేశానికి తరలిస్తారనేది అంచనా. కాగా ‘వందేభారత్’ కార్యక్రమాన్ని భారత్ పొడిగించింది. ఈ నెల 15న రెండో విడత ‘వందే భారత్’ మొదలవుతుంది. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ తదితర దేశాల్లో చిక్కుకుపోయిన మనవాళ్లను స్వదేశానికి తరలిస్తారు.
ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లినవారు స్వస్థలానికి వచ్చేలా ప్రయాణ ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్‌లో కార్మికులు శుక్రవారం భరోసా దీక్ష చేపట్టారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులు తమ తమ లేబర్ క్యాంపుల్లోనే రూమ్‌లలో కూర్చుని నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి గల్ఫ్ భరోసా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవి గౌడ్ మాట్లాడారు. భారత్‌లో ఉన్న గల్ఫ్ రిటర్నీలు, గల్ఫ్ కార్మిక కుటుంబసభ్యులు కూడా ఈ గల్ఫ్ భరోసా దీక్షలో పాల్గొన్నారని తెలిపారు. కరోనాతో గల్ఫ్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నవారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఛార్జీలు భరించాలని, ఇండియాకు వచ్చాక వైద్య పరీక్షలతో పాటు క్వారంటైన్ ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు.