‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటున్న గూగుల్, ట్విటర్ సంస్థలు

ABN , First Publish Date - 2020-03-04T06:26:07+05:30 IST

ప్రాణాంతక కొవిడ్-19(కరోనా) అంతకంతకూ విస్తరిస్తున్న కారణంగా ప్రచంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏటా నిర్వహించే ప్రాముఖ్యమైన ఈవెం

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటున్న గూగుల్, ట్విటర్ సంస్థలు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కొవిడ్-19(కరోనా) అంతకంతకూ విస్తరిస్తున్న కారణంగా ప్రచంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏటా నిర్వహించే ప్రాముఖ్యమైన ఈవెంట్లను రద్దు చేసుకున్నాయి. ఇందులో ఎమ్‌డబ్ల్యూసీ 2020, జీడీసీ 2020, ఫేస్‌బుక్‌కు సంబంధించి ఎఫ్8 2020, గూగుల్స్ క్లౌడ్ నెక్స్ట్ ఈవెంట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా టెక్ కంపెనీలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పనిచేయాలంటూ గూగుల్, ట్విటర్ సహా పలు టెక్ సంస్థలు ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయా కంపెనీలు ప్రకటించాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. డబ్లిన్‌లోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ గూగుల్ ఆదేశించింది. ఐర్లాండ్‌లో కరోనా వైరస్ కేసు నమోదైన కొద్ది రోజులకే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


ఇక మరో టెక్ దిగ్గజం ట్విటర్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరూ ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ ఆదేశించింది. ప్రత్యేకించి ఆసియాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులు తప్పనిసరిగా ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ కంపెనీ స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజి కంపెనీ కాయిన్‌బేస్ సైతం ఇదే తరహా జాగ్రత్తలు తీసుకుంది. ఇంటి వద్ద నుంచి పనిచేయడం సంపూర్ణ పరిష్కారం కాకపోయినప్పటికీ... ఇన్‌ఫెక్షన్స్‌ను అరికట్టేందుకు ఇది కొంతమేర సాయపడుతుందని కాయిన్‌బేస్ సీఈవో బ్రైన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-04T06:26:07+05:30 IST