ఘనంగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 161వ సాహిత్య సదస్సు

ABN , First Publish Date - 2020-12-27T23:50:49+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎప్పిటిలాగే నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డ

ఘనంగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 161వ సాహిత్య సదస్సు

టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎప్పిటిలాగే నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డల్లాస్‌లో ఘనంగా జరిగింది. చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల ‘వినాయకా నిను వినా బ్రోచుటకు’ అనే కీర్తనతో 161వ సాహిత్య సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారి ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘దక్షిణ భారతదేశంలో స్త్రీ వాగ్గేయకారులు’ అనే అంశంపై ప్రసంగం చేశారు. వాగ్గేయకారుల భక్తి సంగీత సాంప్రదాయాల పైనే తొలుత ఈమె సిద్ధాంత గ్రంథం ఉండగా.. ప్రత్యేక శ్రద్ధతో స్త్రీ వాగ్గేయకారులను వెలికితీసే పరిశోధనను మొదలుపెట్టారు. ఈ క్రమంలో భాగంగానే ఇతర ద్రవిడ భాషలతో పరిచయం పెంచుకొని తెలుగే కాకుండా తమిళ, కన్నడ భాషలలోని ప్రతిభా మూర్తులైన సాహిత్యకారిణుల చరిత్రావలోకనం చేశారు.



 ఒక్క కీర్తన రూపంలోనే కాక, లయ, తాళ జ్ఞానం, భావ స్పష్టత విచక్షణా గుణం(కాకువు) ప్రదర్శించిన రచయిత్రులు కూడా వాగ్గేయకారిణులే అన్న సందేశాన్ని తెలియజెప్పారు. వేదకాలంలోని సూర్య, గోష, వాక్ మొదలైన ఋషికలను మొదట పరిచయం చేసి.. తమిళ సంగమ సాహిత్యంలో ఎన్నదగ్గ విదుషీమణులైన కరైక్కాల్, ఆండాళ్, తిరుప్పావై సూక్తులను.. స్వయంగా సంగీత జ్ఞానైన కృష్ణ కుమారి సభలో రాగయుక్తంగా పాట రూపంలో వినిపించారు. దీంతో కన్నడనాటి హన్నమ్మ, రఘనాథనాయకుని సభలలో ప్రభవిల్లిన తెలుగు ప్రతిభా మూర్తులు రామభద్రాంబ, పసుపులేటి రంగాజమ్మను గుర్తు చేశారు. శాంతి స్వభావం, సమతుల్యత గుణాలు ప్రకృతి వరప్రసాదంగా పొందిన స్త్రీలు తమ రచనలలో లాలిత్యము, మాతృ ప్రేమ, భక్తి తత్వ సుగంధ పరిమళాలను ఎంత సహజ సుకుమారంగా పొందుపరుస్తారో కృష్ణ కుమారి చెప్పి, మెప్పించారు.



అంతకుముందు “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి గారు ఆధునిక కవుల ఉక్తులు.. సూక్తులు అన్న శీర్షిక క్రింద బసవరాజు, విశ్వనాథ, సోమసుందర్, దాశరథి ప్రసిద్ధ కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్సుకు హాజరైన వారిని చర్చలో భాగస్వాములను చేశారు. అంతేకాకుండా పొడుపు కథలు, అర్థభేదం గల జంట పదాలు, ఉత్పత్యర్థాలు అనే పలు శీర్షికల పరంపరను ఆయన కొనసాగించారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన పారజాతాపహరణ కృతికర్త ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకులను సభలో ఉటంకించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం.. “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా.. డిసెంబరులో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులు నార్ల, ఉన్నవ, కట్టమంచి, బలిజేపల్లి వంటి మహానుభావుల ఫొటోలను సభ ముందుకు తెచ్చారు. చివరగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు.. డాక్టర్ కృష్ణకుమారికి, సాహితి, సింధూరలతోపాటు వక్తలకు సాహిత్య అభిమానులకు కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




Updated Date - 2020-12-27T23:50:49+05:30 IST