వేసవిలో 'క‌రోనా' ప‌ప్పులు ఉడ‌క‌వట‌ !

ABN , First Publish Date - 2020-04-25T13:37:57+05:30 IST

అతినీలలోహిత కిరణాలకు వైర‌స్‌ను ఎదుర్కొనే శక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ వైర్‌సలోని జన్యు పదార్థాన్ని శక్తివిహీనం చేస్తుంది.

వేసవిలో 'క‌రోనా' ప‌ప్పులు ఉడ‌క‌వట‌ !

సూర్యరశ్మికి కరోనాను అంతమొందించే శక్తి!

అమెరికా శాస్త్ర సలహాదారు వెల్లడి

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 24: అతినీలలోహిత కిరణాలకు వైర‌స్‌ను ఎదుర్కొనే శక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ వైర్‌సలోని జన్యు పదార్థాన్ని శక్తివిహీనం చేస్తుంది. తద్వారా వైరస్‌ ప్రత్యుత్పత్తి జరగదు. అయితే కరోనా వైర్‌సను నాశనం చేసే శక్తి కూడా ఈ కిరణాలకు ఉందని అమెరికాకు చెందిన అధికారులు తాజాగా వెల్లడించారు. సూర్యరశ్మి నుంచి వెలువడే అలా్ట్రవయలెట్‌ కిరణాల ప్రభావం కరోనాపై ఉంటుందని, దీనివల్ల వేసవి కాలంలో కరోనా వ్యాప్తి తగ్గవచ్చని అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీకి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్న విలియం బ్రయాన్‌ చెప్పారు. ఉపరితలంపై, గాలిలో ఉండే కరోనా వైరస్‌ను నాశనం చేయగల శక్తి సూర్య కిరణాలకు ఉన్నట్టు తమ పరిశోధనల్లో తేలిందని బ్రయాన్‌ వెల్లడించారు. ఈ పరిశోధనను మరింత మంది సమీక్షించిన తర్వాత బహిర్గతం చేస్తామని తెలిపారు. అలా్ట్రవయలెట్‌ కిరణాల తీవ్రత ఎంత ఉండాలనేది కూడా ఆ తర్వాతే తెలుస్తుంది. 


దీనికి సంబంధించి అమెరికా చేస్తున్న పరిశోధనలను బ్రయాన్‌ మీడియాకు వెల్లడించారు. ల్యాబ్‌లలో ఉష్ణోగ్రత 70-75 డిగ్రీల ఫారెన్‌హీట్‌ (21 - 24 డిగ్రీల సెల్సియస్‌) వద్ద ఉన్నప్పుడు వైరస్‌ తన సగం జీవితాన్ని కోల్పోయింది. వైర్‌సను గాలిలో వదిలినప్పుడు... 70-75 డిగ్రీల ఉష్ణోగ్రత, 20 శాతం తేమ ఉంటే వైరస్‌ ఒక్క గంటలోనే సగం జీవితం కోల్పోతుంది. కానీ సూర్యరశ్మిలో అయితే ఒకటిన్నర నిమిషంలోనే వైరస్‌ సగం అంతమవుతుందని పరిశోధనలో తేల్చారు. దక్షిణార్థ గోళంలో ఉండే దేశాల్లోని వేడి వాతావరణ పరిస్థితులే అక్కడ తక్కువ కేసులు నమోదవడానికి కారణమని చెప్పారు. తేమ, చలి వాతావరణం కంటే వేడి ఉపరితలాల మీద వైరస్‌ తన ప్రభావాన్ని త్వరగా కోల్పోతుంది. వైర్‌సపైన ఉంటే రక్షణ కవచం వేడి వల్ల శక్తిహీనం అవుతుంది. అయితే సూర్య కిరణాల వల్ల కరోనా పూర్తిగా అంతం అవుతుందని చెప్పలేమని, వ్యాప్తి కొంత తగ్గొచ్చని బ్రయాన్‌ తెలిపారు. అందువల్ల భౌతిక దూరం పాటించడంతోపాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవిలో తగ్గినా చలికాలంలో మళ్లీ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అమెరికా వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - 2020-04-25T13:37:57+05:30 IST