క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు.. రూ. 6 లక్షల జరిమానా
ABN , First Publish Date - 2020-10-28T10:32:06+05:30 IST
యూకేలో ఓ యువతి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించడంతో కోర్టు ఆమెకు 8,500 డాలర్ల(రూ. 6.29 లక్షలు) జరిమానాను విధించింది.

లండన్: యూకేలో ఓ యువతి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించడంతో కోర్టు ఆమెకు 8,500 డాలర్ల(రూ. 6.29 లక్షలు) జరిమానాను విధించింది. క్యారీస్ అన్ ఇంగ్రామ్(22) ఇటీవల మాంచెస్టర్ నుంచి వేరే ప్రాంతానికి విమానంలో ప్రయాణం చేసింది. క్యారీస్ ప్రయాణించిన విమానంలో ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. దీంతో సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్ ఆమెకు సూచించింది. కానీ.. క్యారీస్ ఈ నిబంధనలను పట్టించుకోకుండా షాపింగ్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లిపోయింది.
షాపింగ్‌కు వెళ్లిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అధికారులకు తెలిసిపోయింది. దీంతో కేసు కోర్టు వరకు వెళ్లింది. తాను చేసిన నేరాన్ని అంగీకరించిన క్యారీస్ ఆరు నెలల జైలుశిక్షకు బదులుగా జరిమానా చెల్లించేందుకు సిద్దమైంది. క్వారంటన్ నిబంధనలను పాటించకపోతే ఏం జరుగుతుందో క్యారీస్ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్ తెలిపింది. యూకేలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.