మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి.. విదేశాల్లో ప్రవాసుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-03-23T21:41:32+05:30 IST

సూక్ష్మజీవి కొవిడ్-19(కరోనా)ను నియంత్రించేందుకు ఏ దేశానికాదేశం పకడ్బందీ చర్యలను చేపడుతున్నాయి. విదేశాలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి.

మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి.. విదేశాల్లో ప్రవాసుల ఇక్కట్లు

న్యూఢిల్లీ: సూక్ష్మజీవి కొవిడ్-19(కరోనా)ను నియంత్రించేందుకు ఏ దేశానికాదేశం పకడ్బందీ చర్యలను చేపడుతున్నాయి. విదేశాలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. ఇదే సమయంలో తమ సొంత దేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు భారత్‌కు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాల్లోని ఇండియన్ కమిషన్‌లు తాత్కాలికంగా వసతి కల్పిస్తున్నటికి.. తమకు వసతి అవసరం లేదని.. భారత్‌కు తీసుకెళ్లమంటూ డిమాండ్ చేస్తున్నారు. యూకే, మలేషియాల నుంచి భారత్‌కు అంతర్జాతీయ విమాన రాకపోకలను భారత ప్రభుత్వం మార్చి 31 వరకు నిషేధించడంతో.. ప్రవాసులు ఎయిర్‌పోర్టులలో ఇరుక్కుపోయారు. కౌలాలంపూర్‌లో దాదాపు 280 మంది భారతీయులు ఇక్కట్లు పడుతున్నారు. అదే విధంగా లండన్‌లో 19 మంది భారత్‌కు రాలేక ఇబ్బందికి గురవుతున్నారు. 


కాగా.. ఆయా దేశాల్లోని ఇండియన్ కమిషన్లు స్థానిక ఎన్జీవోల సాయంతో వీరందరికి తాత్కాలికంగా హోటళ్లలో, తదితర ప్రదేశాలలో వసతిని కల్పిస్తున్నాయి. ఇండియన్ కమిషన్ వెంటనే స్పందించడం లేదంటూ ప్రవాసులు మండిపడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలకు తమ గోడును వినిపించామని.. వారి ద్వారా ఇండియన్ కమిషన్ స్పందించిందని ఓ ప్రవాస భారతీయుడు వివరించాడు. ఇండియన్ కమిషన్ ప్రవాసులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రవాసులు భారత ప్రభుత్వాన్ని కోరారు. మలేషియాలో కరోనా కేసులు 900కు చేరుకోవడంతో.. అక్కడి భారతీయులు బెంబేలెత్తుతున్నారు. ‘విదేశాల్లో ఇబ్బందులు పడలేక చాలా మంది భారతీయులు తమ స్వదేశానికి రావాలని చూస్తున్నారు. ప్రవాసులను తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు అధికారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రవాసులను జాగ్రత్తగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం పనిచేస్తోంది’ అని ఫారెన్ సెక్రటరీ హర్ష వర్థన్ ష్రింగ్లా తెలిపారు.

Updated Date - 2020-03-23T21:41:32+05:30 IST