యూఏఈలో చిక్కుకున్న 350 మంది భార‌త వ‌ర్క‌ర్లు.. టీకి కూడా డ‌బ్బుల్లేక‌..

ABN , First Publish Date - 2020-05-13T17:38:58+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం వ‌ల్ల ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో చాలా మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో వారిని భార‌త ప్ర‌భుత్వం వందే భార‌త్ మిష‌న్ ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే.

యూఏఈలో చిక్కుకున్న 350 మంది భార‌త వ‌ర్క‌ర్లు.. టీకి కూడా డ‌బ్బుల్లేక‌..

యూఏఈ: మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం వ‌ల్ల ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో చాలా మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇలా విదేశాల్లో చిక్కుకున్న‌ వారిని భార‌త ప్ర‌భుత్వం 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. దాంతో అబుధాబిలో చిక్కుకున్న 350 మంది భార‌త వ‌ర్క‌ర్లు త‌మ‌ను కూడా వీలైనంత త్వ‌ర‌గా స్వ‌దేశానికి త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద‌ క‌నీసం టీ తాగ‌డానికి కూడా డ‌బ్బులు లేవ‌ని వారు వాపోతున్నారు. అబుధాబిలోని ఓ దీవిలో ఉన్న ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో వీరంద‌రూ వ‌ర్క‌ర్లుగా ఉన్నారు.


అయితే కొవిడ్‌-19 వ‌ల్ల వారు ఉపాధి కోల్పోయారు. దీంతో ఆదాయం లేక చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేదు. గ‌త నెల రోజులుగా సుమారు 350 మంది భార‌త వ‌ర్క‌ర్లు అబుధాబిలోని అల్ ఐన్‌, రువైస్ ప్రాంతాల్లో చిక్కుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీహార్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల‌కు చెందిన వారు ఉన్నారు. కాగా, వీరిలో 200 మంది వ‌ర‌కు యూపీ, బీహార్ వాసులే ఉన్న‌ట్లు స‌మాచారం. భార‌త ప్ర‌భుత్వం పంపించే ప్ర‌త్యేక విమానం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

 

అల్ ఖాజ్నాలో ఉంటున్న‌ ఉత్తర ప్రదేశ్ చెందిన‌ కార్మికుడు ఇంద్రజీత్ యాదవ్ మాట్లాడుతూ...  "మేము అల్ ఐన్‌లో సుమారు 350 మంది ఉన్నాం. మాలో సుమారు 200 మంది ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ నుండి వచ్చారు. మేము జనవరిలో ఇక్కడకు వచ్చాం. మార్చి నాటికి మా ప్రాజెక్ట్ ముగిసింది. ఆ సమయంలో మా చేతికి వ‌చ్చిన జీతాలు తీసుకుని స్వ‌దేశంలో ఉన్న మావాళ్ల‌కు పంపించేశాం. మార్చి 29న భార‌త్‌కు బ‌య‌ల్దేరాల్సింది. ఇంత‌లోనే కొవిడ్‌-19 క‌ల్లోలం మొద‌లు కావ‌డంతో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌చ్చాయి. దాంతో గత 45 రోజులుగా ఇక్క‌డే చిక్కుకుపోయాం. ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎంతో ఆశతో తిరిగి స్వ‌స్థ‌లాల‌కు వెళ్తామ‌ని ఎదురుచూస్తున్నాం." అని చెప్పారు. 


క‌నీసం టీకి కూడా డ‌బ్బుల్లేవు

బీహార్‌కు చెందిన మజార్ మియా అనే మ‌రో కార్మికుడు మాట్లాడుతూ... "45 రోజులుగా వ‌స‌తి గృహంలోనే ఉండిపోవ‌డంతో చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేదు. క‌నీసం టీ తాగ‌డానికి కూడా త‌మ వ‌ద్ద డ‌బ్బుల్లేవు. దొరికిన ఆహారంతోనే పొట్ట నింపుకుంటున్నాం. ఇక నిత్యావసరాలు కొనడానికి ప్రతిరోజూ రెండు గంటలు (సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు) తమ వసతి గృహం నుండి బయటకు వెళ్ళడానికి వీలు కల్పిస్తున్నారు. కానీ మా వ‌ద్ద నిత్యావ‌స‌ర స‌రుకుల కొనుగోలుకు డబ్బు లేవు" అని చెప్పారు.


మాతో పాటు క్యాంపులో ఉంటున్న‌ బీహార్ రాష్ట్రం సివ‌న్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి ఇటీవ‌ల అనారోగ్య సమ‌స్య‌తో మ‌ర‌ణించాడు. అత‌నికి కరోనా సోక‌లేద‌ని వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. కానీ అప్ప‌టి నుంచి మాలో ఎదో తెలియ‌ని అభద్రతా భావం మొద‌లైంది. అని అజ‌య్ సింగ్ అనే మ‌రో కార్మికుడు చెప్పాడు.


వీలైనంత త్వ‌ర‌గా స్వ‌దేశానికి త‌ర‌లించండి

అందరూ స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నార‌ని, వీలైనంత త్వ‌ర‌గా మ‌మ్మ‌ల్ని స్వ‌దేశానికి త‌ర‌లించాల‌ని గుజరాత్‌కు చెందిన సంతోష్ పేతే అనే కార్మికుడు తెలిపాడు. "ప్రతిరోజూ కనీసం ఒక కార్మికుడు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నాడు. ఇది మాకు చాలా కష్టమైన స‌మ‌యం. మా అంద‌రినీ ప్రాధాన్యత ప్రాతిపదికన విమానంలో పంపించాలని మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి విమానంలో లేదా ఓడ ద్వారా మమ్మల్ని స్వదేశానికి త‌ర‌లించండి." అని సంతోష్ పేర్కొన్నాడు.


కాగా, ఈ కార్మికుల్లో చాలా మంది ఇండియన్ మిషన్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌లో త‌మ పేరు నమోదు చేసుకున్నారు. దీంతో త్వరలో స్వదేశానికి వచ్చే విమానాల టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, యూఏఈతో పాటు ఇత‌ర దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను 'వందే భార‌త్ మిష‌న్' రెండో ద‌ఫాలో మే 16 నుంచి 22 వ‌ర‌కు స్వ‌దేశానికి త‌రలించేందుకు భార‌త ప్ర‌భుత్వం 149 విమానాలు న‌డ‌ప‌నుంది. ఇక ఇప్ప‌టికే మొద‌టి ద‌ఫాలో 31 విమానాల్లో 6,037 మంది భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. 

Updated Date - 2020-05-13T17:38:58+05:30 IST