ఫైజర్ వ్యాక్సిన్ డోసుల కేటాయింపుల్లో కోత !
ABN , First Publish Date - 2020-12-19T13:01:15+05:30 IST
ఫైజర్ వ్యాక్సిన్‌తో అమెరికాలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పంపిణీపరమైన జాప్యం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం తమకు అందే వ్యాక్సిన్ డోసుల సంఖ్య భారీగా తగ్గనుందని సమాచారం అందినట్లు పలు రాష్ట్రాలు వెల్లడించాయి.

ఓఫ్యాలన్ (మిస్సోరి), డిసెంబరు 18 : ఫైజర్ వ్యాక్సిన్‌తో అమెరికాలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పంపిణీపరమైన జాప్యం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం తమకు అందే వ్యాక్సిన్ డోసుల సంఖ్య భారీగా తగ్గనుందని సమాచారం అందినట్లు పలు రాష్ట్రాలు వెల్లడించాయి. భారీ కొవిడ్ కేసులతో అల్లాడుతున్న కాలిఫోర్నియా రాష్ట్రానికి మొదటివారంలో అత్యధికంగా 3.27 లక్షల వ్యాక్సిన్ డోసులు అందగా.. రెండోవారంలో దాదాపు 40 శాతం తక్కువగా 1.60 లక్షల డోసులే అందే అవకాశం ఉంది. నెవాడా రాష్ట్రానికి 42% తక్కువగా, హవాయ్ రాష్ట్రానికి 40% తక్కువగా, మిస్సోరి రాష్ట్రానికి 30% తక్కువగా, మిచిగాన్‌కు మొదటివిడతలో అందిన డోసుల్లో నాలుగోవంతు మాత్రమే పంపిణీ కానున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ఆలస్యంగా డోసులు అందే సూచనలు కూడా ఉన్నాయి. ఈ గందరగోళంపై స్పందించిన ఫైజర్ కంపెనీ లిఖితపూర్వక వివరణను విడుదల చేసింది.
‘‘మా వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో ఎలాం టి జాప్యం జరగడం లేదు. వ్యాక్సిన్‌కు ఆమోదం లభించిన మొదటివారంలో 64 లక్షల డోసులను పంపిణీ చేయాలని అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అందుకు అనుగుణంగా వెంటనే 29 లక్షల డోసులను రాష్ట్రాలకు పంపాం. మొదటి డోసును ఇచ్చిన వారికి 21 రోజుల తర్వాత రెండో డోసును అందించేందుకు మరో 29 లక్షల డోసులను గిడ్డంగుల్లో సిద్ధంగా ఉంచాం. అవి పోను మరో ఐదారు లక్షల డోసులను అత్యవసర అవసరాల కోసం స్వయంగా ప్రభుత్వమే నిల్వ చేసుకుంది. అదనపు డోసుల పంపిణీపై మాకు ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదు’’ అని స్పష్టం చేసింది.