సంచలనాలకు చిరునామాగా మారిన న్యూజిల్యాండ్ ప్రధానిపై ప్రత్యేక కథనం..

ABN , First Publish Date - 2020-11-26T09:46:57+05:30 IST

లింగవివక్ష వేళ్లూనుకున్న ఫిన్లాండ్‌లో ఓ మహిళ ప్రధాని పదవిని అలంకరించడమంటే సామాన్య విషయం కాదు. అలాంటిది వయసు చిన్నదే అయినా...

సంచలనాలకు చిరునామాగా మారిన న్యూజిల్యాండ్ ప్రధానిపై ప్రత్యేక కథనం..

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సనా మిరెలా మారిన్‌. ముప్ఫై నాలుగేళ్ల వయసుకే ఫిన్లాండ్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ఆమె... వినూత్న విధానాలతో దూసుకుపోతున్నారు. అదే స్థాయిలో వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగానూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొన్నామధ్యలో-కట్‌ బ్లేజర్‌ ధరించినందుకు కొందరు నానా రాద్ధాంతం చేశారు. ప్రధాని పదవి పరువు తీస్తున్నావన్నారు. కానీ సనా మారిన్‌ ఇవేవీ పట్టించుకోలేదు. తాను నమ్మిన సిద్ధాంతం... తనను నమ్ముకున్న ప్రజల కోసం సాహసోపేత నిర్ణయాలతో అడుగులు వేస్తున్నారు. 


‘ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలాంటివి చేయడం తగద’ని ఒకరంటే... ‘మీరు మోడలా... ప్రధానా’ అంటూ మరొకరు విమర్శించారు. ‘ప్రధాని పదివిని దిగజార్చార’ని వేరొకరు వ్యాఖ్యానించారు. అభివృద్ధి మంత్రం... పదునైన తంత్రంతో ఎప్పటికప్పుడు విమర్శకుల నోళ్లు మూయిస్తున్న ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు.


లింగవివక్ష వేళ్లూనుకున్న ఫిన్లాండ్‌లో ఓ మహిళ ప్రధాని పదవిని అలంకరించడమంటే సామాన్య విషయం కాదు. అలాంటిది వయసు చిన్నదే అయినా... పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా... సవాళ్లెన్నింటినో ఎదుర్కొని... చిక్కుముడులెన్నింటినో ఛేదించుకుని గత ఏడాది డిసెంబర్‌లో ఆ కుర్చీలో కూర్చున్నారు సనా మారిన్‌. అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని అయ్యి రికార్డు సృష్టించిన ఆమె... ప్రపంచం దృష్టిని ఆకర్షించడంలో వింతేమీ లేదు. కానీ ఆ తరువాత తక్కువ వ్యవధిలోనే తీసుకువచ్చిన సంస్కరణలు, విధానాలూ ఆమెను సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా ప్రపంచం ముందు ఉంచాయి. ఉద్యోగుల పనిదినాలను వారంలో నాలుగు రోజులకు తగ్గించడం ఆమె తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. ‘‘ఉద్యోగులు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మరింత సమయం గడిపేందుకు, అలాగే తమ అభిరుచులకు సమయం కేటాయించేందుకు, జీవితంలోని విభిన్న కోణాలను స్పృశించే వీలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ ఆ సమయంలో సనా ప్రకటించారు. 


అదొక్కటే కాదు... 

లింగ సమానత్వం, స్త్రీ-పురుషుల జీతాల్లో అసమానతలపై గళమెత్తుతూనే ఉన్నారు సనా. సమాజంలో అందరూ సమానమేననే స్ఫూర్తి రగిలించి, మహిళల సాధికారతకు కంకణం కట్టుకున్నారు. అలాగని పురుషులను తక్కువ చేసే ఉద్దేశంలేదంటారామె. మహిళా ఉద్యోగులతో సమానంగా మగవారికి కూడా ‘పెటర్నిటీ లీవ్‌’ వ్యవధిని పెంచారు. ఇక ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసి, కేసులు తగ్గించడంలో గణనీయమైన కృషి చేశారు. ఆధునిక సాంకేతికతను వాడుకొంటూ... సామాజిక మాధ్యమాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులను గుర్తించారు.


‘ఫ్లాటెన్‌ ద కర్వ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో వారి సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం కల్పించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించిన సమాచారాన్ని మూలమూలలకూ చేరవేయగలిగారు. ‘‘ప్రభుత్వ మాధ్యమాల ద్వారా ప్రతిఒక్కరికీ సమాచారాన్ని అందించడం కుదరదు. ఈ వాస్తవాన్ని అంగీకరించకతప్పదు. కానీ ఇవాళ, ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల ద్వారానే దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకొంటోంది. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం’’ అంటారు సనా. 


నల్లేరుపై నడక కాదు...  

రాజకీయాలంటే దూరం జరిగే యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆధునిక మహిళ సనా మారిన్‌. కానీ ఆమెకు ఇది వారసత్వంగా వచ్చింది కాదు. కృషితో సాధించుకున్నది. ‘ఇద్దరు తల్లుల’ ముద్దుల కూతురైన సనా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆమె తల్లితో తండ్రి విడిపోవడం... తల్లి మరొక మహిళతో సహజీవనాన్ని ఎంచుకోవడం... వారిద్దరి పెంపకంలో తాను పెరగడం... అంతా ఓ సినిమా కథను తలపిస్తుంది. అయితే అన్నీ తానై అమ్మే మద్దతునిచ్చారు. సనా ఏది కావాలంటే అది చేయడానికి స్వేచ్ఛనిచ్చారు. అందుకే ‘అమ్మే లేకపోతే నేను లేను’ అని భావోద్వేగంగా చెబుతారు ఈ యువ ప్రధాని. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి చదువుతూనే బేకరీలో పని చేశారు సనా. వీధుల్లో మ్యాగజైన్లు అమ్మారు. కష్టపడుతూనే అడ్మినిస్ర్టేటివ్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 


టీనేజీలోనే రాజకీయాల్లోకి... 

సనా మారిన్‌ కాలేజీలో ఉండగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ‘సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఫిన్లాండ్‌’ యువ విభాగమైన ‘సోషల్‌ డెమొక్రటిక్‌ యూత్‌’లో పని చేశారు. మొట్టమొదటిసారి ‘సిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ టెంపెర్‌’కు పోటీ చేసి ఓడిపోయారు. కానీ కుంగిపోలేదు. 2012లో గెలుపొంది, కొద్ది నెలల్లోనే సిటీ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. తరువాత ‘సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ’కి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2015లో తొలిసారి ఎంపీగా పోటీ చేసి నెగ్గారు. సనా పడిన కష్టం, కుటుంబ నేపథ్యమే ఆమెను గెలిపించింది. నాలుగేళ్ల తరువాత అదే స్థానం నుంచి తిరిగి ఎన్నికై, 2019లో ట్రాన్స్‌పోర్ట్‌, కమ్యూనికేషన్స్‌ మంత్రి అయ్యారు. అదే ఏడాది ఏర్పడిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె ప్రధాని పీఠం దక్కించుకున్నారు. 


స్నేహితుడితో జీవిత బంధం...  

అటు రాజకీయ జీవితంతో పాటు ఇటు వ్యక్తిగత జీవితాన్ని కూడా సన సమర్థవంతంగా నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో తన చిరకాల మిత్రుడు, ఫుట్‌బాల్‌ ఆటగాడు మార్కస్‌ రాయ్‌కెన్‌ను పెళ్లాడారు. పదహారేళ్లుగా సహజీవనం సాగిస్తున్న వారికి అప్పటికే రెండేళ్ల కూతురు ఉంది. ‘‘సుఖదుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడ్డ తాము ఇప్పుడు భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఇష్టమైన వ్యక్తితో జీవితం పంచుకొంటున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ సనా మారిన్‌ పెళ్లి తరువాత ట్వీట్‌ చేశారు. 


డ్రెస్సింగ్‌పై రభస... 

ఐదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సనా మారిన్‌ ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. ‘ట్రెండీ’ మేగజైన్‌ కోసం చేసిన ఫొటోషూటే ఇందుకు కారణం. ఇన్నర్‌వేర్‌ లేకుండా లో-కట్‌ బ్లేజర్‌ వేసుకున్న ఆ షూట్‌లోని ఓ ఫొటోను సనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పురుషాధిక్యత గల ఫిన్లాండ్‌లో దానిపై పెద్ద దుమారమే రేగింది. ప్రతిపక్షాలు, సంప్రదాయ వాదులు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలాంటివి చేయడం తగద’ని ఒకరంటే... ‘మీరు మోడలా... ప్రధానా’ అంటూ మరొకరు విమర్శించారు. ‘ప్రధాని పదివిని దిగజార్చార’ని వేరొకరు వ్యాఖ్యానించారు. అభివృద్ధి మంత్రం... పదునైన తంత్రంతో ఎప్పటికప్పుడు విమర్శకుల నోళ్లు మూయిస్తున్న ఆమె వీటిని పెద్దగా పట్టించుకోలేదు. అధికారం అలంకారంలా మిగిలిపోకుండా... ఆధునిక సిద్ధాంతాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ ధీశాలి నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - 2020-11-26T09:46:57+05:30 IST