ప్రత్యేక విమానంలో మలేషియా నుంచి భారతీయుల తరలింపు

ABN , First Publish Date - 2020-03-23T23:34:42+05:30 IST

మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 104 మంది భారతీయులు సోమవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు.

ప్రత్యేక విమానంలో మలేషియా నుంచి భారతీయుల తరలింపు

న్యూఢిల్లీ: మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 104 మంది భారతీయులు సోమవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు. విదేశాల్లోని 405 మంది ప్రవాసులను తిరిగి తెచ్చేందుకు భారత ప్రభుత్వం మార్చి 17న రెండు ఎయిర్ ఏషియా విమానాలకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి మలేషియా నుంచి ఢిల్లీకి, మరొకటి ఇరాన్ నుంచి విశాఖపట్నానికి చేరుకుంటాయి. మలేషియా నుంచి ప్రత్యేక విమానం సోమవారం వస్తుండగా, మరో విమానం ఈ వారంలో భారత్‌కు రానుంది. కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 300 మంది భారతీయులున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరందరికి స్థానిక ఎన్జీవోల సాయంతో ఇండియన్ కమిషన్ వసతి కల్పించింది. అంతేకాకుండా పగలు, రాత్రి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు ఇండియన్ కమిషన్ ఆదివారం ట్వీట్ చేసింది. అయితే వీరిలో ఇమ్మిగ్రేషన్‌ను పూర్తి చేసుకుని, కరోనా నెగిటివ్ అని తేలిన వారిని మాత్రమే ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకురానున్నారు. మిగతా వారు ఇండియన్ కమిషన్ ఆధీనంలోనే ఉంటారు. కాగా.. ఈ విమానం ఢిల్లీకి చేరుకున్నాక.. ఢిల్లీలో చిక్కుకున్న మలేషియా దేశస్థులతో తిరిగి ఇదే విమానం మలేషియాకు వెళ్లనుంది. భారత్‌లో మొత్తంగా 1075 మంది మలేషియా దేశస్థులు చిక్కుకున్నట్టు మలేషియా విదేశాంగశాఖ మంత్రి మార్చి 19న ప్రకటించారు. భారత్‌లో చిక్కుకున్న వివిధ దేశస్థులను స్వదేశాలకు తరలించేందుకు ఆయా దేశాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి.

Updated Date - 2020-03-23T23:34:42+05:30 IST