స్పెయిన్‌లో తగ్గుతున్న కరోనా కేసులు?

ABN , First Publish Date - 2020-03-27T18:19:02+05:30 IST

ప్రపంచ దేశాల్లో కరోనా బారిన పడి ఎక్కువగా మరణించిన దేశాల జాబితాలో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి

స్పెయిన్‌లో తగ్గుతున్న కరోనా కేసులు?

మాడ్రిడ్: ప్రపంచ దేశాల్లో కరోనా బారిన పడి ఎక్కువగా మరణించిన దేశాల జాబితాలో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య గురువారం 4 వేలను దాటింది. ఒక్కరోజులో 655 మంది మృత్యువాతపడ్డారు. అయితే ముందు రోజుతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువగానే ఉంది. బుధవారం 738 మంది చనిపోగా.. గురువారం ఈ సంఖ్య 19 శాతం తగ్గింది. అదే విధంగా కేసుల నమోదు కూడు ముందు రోజు కంటే తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో స్పెయిన్‌లో కరోనా అదుపులోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం మార్చి 14న లాక్ డౌన్ ప్రకటించినప్పటికి.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ప్రతిరోజు ముందు రోజు కంటే ఎక్కువ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉండటం కనిపించింది. ప్రభుత్వం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 11 వరకు పొడిగించడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతున్నట్టు తెలుస్తోంది. గురువారం నమోదైన కేసుల సంఖ్య చూస్తోంటే కరోనా తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సాల్వడర్ అన్నారు. స్పెయిన్‌లో నిత్యం 15 వేల నుంచి 20 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ సంఖ్యను కూడా 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. దీని కోసం విదేశాల నుంచి లక్షలాది టెస్ట్ కిట్స్‌ను ప్రభుత్వం ఆర్డర్ చేసిందని తెలిపారు. కరోనా ఎక్కువగా వృద్దులపై ప్రభావం చూపుతుండటంతో.. స్పెయిన్‌లో ఉన్న వృద్దులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కాగా.. దేశ ప్రధాని పెడ్రో భార్యకు కూడా కరోనా సోకడంతో 1936 తరువాత దేశం మళ్లీ ఇప్పుడే క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని పెడ్రో అన్నారు.

Updated Date - 2020-03-27T18:19:02+05:30 IST