దక్షిణ డకోటా గవర్నర్‌కు కరోనా.. ట్రంప్‌ ఆరోగ్యంపై వదంతులు !

ABN , First Publish Date - 2020-07-08T13:23:49+05:30 IST

అమెరికాలోని దక్షిణ డకోటాలో కరోనా విజృంభించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ క్రిస్తి నియోమ్‌కు వైరస్‌ సోకిందనే ప్రచారం జరుగుతోంది.

దక్షిణ డకోటా గవర్నర్‌కు కరోనా.. ట్రంప్‌ ఆరోగ్యంపై వదంతులు !

ట్రంప్‌తో కలిసి విమాన ప్రయాణం

వాషింగ్టన్‌, జూలై 7: అమెరికాలోని దక్షిణ డకోటాలో కరోనా విజృంభించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ క్రిస్తి నియోమ్‌కు వైరస్‌ సోకిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ రాష్ట్రంలో ఎన్నికలకు నిధులు సేకరించేందుకు అధ్యక్షుడి కుమారుడు జూనియర్‌ ట్రంప్‌, ఆయన స్నేహితురాలు కింబెర్లీ గిల్ఫోలె పర్యటించారు. ఈ క్రమంలో కింబెర్లీకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీనికి ముందు కింబెర్లీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండడంతో గవర్నర్‌ నియోమ్‌కు కూడా వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే, నియోమ్‌ రిపోర్ట్‌ రాకముందు అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమెతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నియోమ్‌, ట్రంప్‌లు ఒకే విమానంలో ప్రయాణించారు.దీంతో అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్యంపై వదంతులు హల్‌చల్‌ చేశాయి. అయితే, శ్వేతసౌధం అధికారులు వీటిని ఖండించారు. 


బ్రెజిల్‌ అధ్యక్షుడికీ..

రియోడిజనెరియో: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోకు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంగళవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తొలిసారి ఆయన మాస్కు ధరించి మాట్లాడారు. కాగా, పాకిస్థాన్‌లో మంగళవారం ఒక్కరోజే 2,691 కొత్త కేసులు నమోదవగా 77 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 4,839 మంది ప్రాణాలు కోల్పోగా, 2,34,508 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-07-08T13:23:49+05:30 IST