సింగ‌పూర్ నుంచి హైద్రాబాద్‌కు బ‌య‌ల్దేరిన 146 మంది తెలుగు వారు

ABN , First Publish Date - 2020-06-18T14:42:43+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్ర‌వాసుల‌ను అక్క‌డి తెలుగు స‌మాజం స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది.

సింగ‌పూర్ నుంచి హైద్రాబాద్‌కు బ‌య‌ల్దేరిన 146 మంది తెలుగు వారు

సింగపూర్ సిటీ: క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్ర‌వాసుల‌ను అక్క‌డి తెలుగు స‌మాజం స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. తెలుగు స‌మాజం సౌజ‌న్యంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌ 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి హైద్రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. వీరిలో 82 మంది తెలంగాణ వారు, 62 మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారు ఉండ‌గా... ఇద్ద‌రు త‌మిళ‌నాడుకు చెందిన వారు ఉన్నారు. కాగా, ఇంత‌కుముందు కూడా తెలుగు స‌మాజం వారు కోవిడ్ వ‌ల్ల‌ సింగపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం భార‌త విదేశాంగ శాఖ‌, హోంమంత్రిత్వ శాఖ‌తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, సింగపూర్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ స‌హాయంతో ఈ నెల 11న హైద్రాబాద్‌కు‌ ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానంలో తెలుగు వారిని స్వ‌దేశానికి పంపించ‌డం జ‌రిగింది. ఈ విమానం ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో స‌హ‌క‌రించార‌ని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి ఆయ‌న‌ ప్ర‌త్యేకంగా ధన్యవాదములు తెలిపారు.


అయితే, ఈ విమానం వ‌చ్చిన త‌ర్వాత కూడా ఎంతో మంది తెలుగు వారు ఇలాగే ఇక్క‌ట్లు ఎదుర్కొంటూ సింగ‌పూర్ తెలుగు స‌మాజాన్ని క‌లిశారు. వీరిలో గ‌ర్భిణీలు, వ‌య‌సుపైబ‌డిన వారు, మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉన్న‌వారు ఉన్నారు. వీరు తెలుగు స‌మాజం ముందు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు. దాంతో వెంట‌నే స్పందించిన తెలుగు స‌మాజం చార్టెడ్ విమానం ఏర్పాటు చేసింది. ఈ విమానం ఏర్పాటుకు స‌హ‌క‌రించిన‌ క‌పిల్ ఏరో చైర్మ‌న్ టీ చిన్న‌బాబు, తెలంగాణ అండ్‌ ఏపీ ఏవియేష‌న్ ఎండీ భ‌ర‌త్ రెడ్డికి సింగ‌పూర్ తెలుగు స‌మాజం ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపింది. అలాగే ఈ విమానంలో ఉన్న‌ 62 మంది ఏపీ వాసుల‌ను హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వెళ్ల‌డంలో సాయం చేస్తున్న ఏపీఎన్ ఆర్‌టీ చైర్మన్ మేడపాటి వెంకట్‌కు తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషన్ సేవ‌ల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు.

Updated Date - 2020-06-18T14:42:43+05:30 IST