ఆస్ట్రేలియాలో ఉదారతను చాటుతున్న సిక్కు సమాజం
ABN , First Publish Date - 2020-04-05T19:35:51+05:30 IST
కరోనా రక్కసి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే 190కి పైగా దేశాలకు పాకింది.

మెల్బోర్న్: కరోనా రక్కసి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే 190కి పైగా దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి సోకింది. 64వేలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది.. అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అటు ఆస్ట్రేలియాలో కూడా కొవిడ్-19 తన ఉనికిని చాటుకుంది. ఇక్కడ 5,635 మంది కరోనా బాధితులు ఉండగా, 34 మంది మృత్యువాత పడ్డారు. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలా స్వీయ నిర్బంధంలో ఉండి, ఆర్థికంగా చితికిపోయినవారికీ అక్కడి సిక్కు సమాజం అండగా నిలుస్తోంది. ప్రతిరోజు ఉచితంగా మీల్స్, నిత్యావసర సరుకులను అందిస్తోంది. ఫేస్బుక్ ద్వారా దీనిపై ప్రచారం కల్పించి మీల్స్, నిత్యావసర సరుకులు కావాలనుకునే విక్టోరియాలోని కుటుంబాలు తమను సంప్రదించాల్సిందిగా సిక్కు వాలంటీర్స్ ఆస్ట్రేలియా(ఎస్వీఏ) అనే సిక్కు గ్రూపు పిలుపునిచ్చింది.
ఈ ఫేస్బుక్ గ్రూపులోని 20 మంది సభ్యులు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా మారి రోజుకి 800 మీల్స్ ఇంటింటికి వెళ్లి పంచిపెడుతున్నారు. మెల్బోర్న్లో మూడేళ్ల క్రితం ఏర్పాటైన ఎస్వీఏ... వృద్ధులు, ఒంటరి తల్లిదండ్రులకు, అవసరమైన వారికి ఉచిత ఫుడ్ ప్యాక్ అందిస్తున్నామని ఈ గ్రూపు మెంబర్ అయిన మన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఎస్వీఏతో పాటు యునైటెడ్ సిక్కులు అనే మరో సంస్థ కూడా ఉచిత భోజనం, ఆహార సామాగ్రిని అందించడం ద్వారా అవసరమైనవారికి సహాయం చేస్తోంది. ఇలా కరోనా సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ఆస్ట్రేలియాలోని పేద, ఒంటరి జనాలకు సిక్కు సంఘాలు తమ వంతు సాయం చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.