రైతుల నిరసనకు మద్దతుగా.. యూఎస్‌లోని వివిధ నగరాల్లో ర్యాలీలు

ABN , First Publish Date - 2020-12-06T18:19:54+05:30 IST

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో 11 రోజులుగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

రైతుల నిరసనకు మద్దతుగా.. యూఎస్‌లోని వివిధ నగరాల్లో ర్యాలీలు

వాషింగ్టన్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో 11 రోజులుగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల నిరసనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అటు రైతుల నిరసన హోరుపై ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. తాజాగా రైతుల నిరసనకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికాలోని వివిధ నగరాల్లో అక్కడి భారతీయ అమెరికన్లు ర్యాలీలు నిర్వహించారు. శనివారం కాలిఫోర్నియాలో వందలాది సిక్కు-అమెరికన్లు శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇక కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్లలో భారీ సంఖ్యలో నిరసనకారులు ర్యాలీగా రావడంతో బే బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వీరు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లడం జరిగింది. 


అలాగే సుమారు 500 మంది సిక్కు-అమెరికన్లు ఇండియానాలోని వివిధ ప్రాంతాల నుంచి డౌన్‌టౌన్ ఇండియానాపోలీస్ వద్ద గుమిగూడారు. ఈ రెండు చోట్ల కూడా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ చట్టాలు భారతీయ రైతులను పేదరికం వైపు నెట్టి కార్పొరేట్ రంగాలకు గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టేలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు "నో ఫార్మర్స్, నో ఫుడ్", "సేవ్ ద ఫార్మర్స్" నినాదాలతో హోరెత్తించారు. కాగా, బే ఏరియాలో జరిగిన నిరసన కాలిఫోర్నియాకు చెందిన 'జకారా మూవ్‌మెంట్' ఆధ్వర్యంలో జరిగింది. 

Updated Date - 2020-12-06T18:19:54+05:30 IST