రైతుల ఆందోళనపై భారత్‌తో చర్చించండి.. అమెరికా చట్ట సభ్యుల లేఖ

ABN , First Publish Date - 2020-12-25T16:56:56+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళనపై భారత విదేశాంగ శాఖతో చర్చించాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఏడుగురు చట్ట సభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు తాజాగా లేఖ రాశారు.

రైతుల ఆందోళనపై భారత్‌తో చర్చించండి.. అమెరికా చట్ట సభ్యుల లేఖ

వాషింగ్టన్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళనపై భారత విదేశాంగ శాఖతో చర్చించాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఏడుగురు చట్ట సభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు తాజాగా లేఖ రాశారు. వీరిలో భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. "అనేక మంది భారతీయ అమెరికన్లకు ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ ఆందోళన వల్ల యావత్తు భారతదేశంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇది అగ్రరాజ్యంలో ఉన్న భారతీయులందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. దీనిపై భారత విదేశాంగతో చర్చించండి." అని చట్ట సభ్యులు తమ లేఖలో పేర్కొన్నారు. జయపాల్‌తో పాటు కాంగ్రెస్ సభ్యుడు డోనాల్డ్ నోర్‌క్రాస్, బ్రెండన్ ఎఫ్ బాయిల్, బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, మేరీ గే స్కాన్‌లాన్, డెబ్బీ డింగెల్, డేవిడ్ ట్రోన్ ఈ లేఖలో సంతకం చేశారు. 


ఇక గత కొన్ని వారాలుగా భారతదేశంలో రైతుల నిరసనపై డజనుకు పైగా యూఎస్ కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు భద్రత కల్పించాలని డెమొక్రాటిక్ అమెరికన్ శాసనసభ్యుడు డేవిడ్ ట్రోన్ మంగళవారం భారత ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఇటీవల మధ్యవర్తిత్వం ఏర్పాటు చేయాలని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతిపాదనను కూడా ఆయన ప్రశంసించారు. అయితే, రైతుల నిరసన విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని గతంలోనే భారత్ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అంతర్గత విషయమని, దీనిపై బయటి వ్యక్తుల వ్యాఖ్యలు అనవసరమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బ్లాక్ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో అన్నదాతల ఉద్యమం గురువారంతో 30వ రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు వెనుకాడుగు వేయకుండా గత నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. 

Updated Date - 2020-12-25T16:56:56+05:30 IST