సౌదీ మరో సంచలన నిర్ణయం !
ABN , First Publish Date - 2020-05-13T18:13:46+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న మహమ్మారి కరోనా.. అటు గల్ఫ్‌లో కూడా విజృంభిస్తోంది.

రియాద్: ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న మహమ్మారి కరోనా.. అటు గల్ఫ్‌లో కూడా విజృంభిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్‌లో విరుచుకుపడుతోంది. దాంతో కోవిడ్-19 కట్టడికి ఇప్పటికే గల్ఫ్ దేశాలు కఠిన చర్యలు చేపట్టాయి. తాజాగా కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సౌదీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈద్ అల్ ఫితర్ సెలవు రోజుల్లో కూడా కర్ఫ్యూ సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సెలవులు ఉండే ఆ ఐదు రోజుల్లో(మే 23 నుంచి 27 వరకు) సైతం సౌదీలో 24 గంటల కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మక్కా మినహా సౌదీలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయనున్నారు. ఇదిలాఉంటే సౌదీలో స్వైర విహారం చేస్తున్న కరోనా వల్ల ఇప్పటివరకు 264 మంది చనిపోయారు. 42,925 మందికి ఈ వైరస్ సోకింది.