భారతీయ ఉద్యోగుల పట్ల సౌదీ కంపెనీ ఉదారత..
ABN , First Publish Date - 2020-06-11T16:28:30+05:30 IST
కరోనా కల్లోలం కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలా మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు.

కొచ్చి: కరోనా కల్లోలం కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలా మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇలా సౌదీలో చిక్కుకుపోయిన 1600 మంది భారతీయ ఉద్యోగులను అక్కడి ఓ కంపెనీ తన సొంత ఖర్చులతో చార్టర్ విమానాలు ఏర్పాటు చేసి స్వదేశానికి తరలిస్తోంది. ఎక్స్‌పర్టైజ్ కాంట్రాక్టింగ్ అనే కంపెనీ తమ వద్ద పని చేసే భారత ఉద్యోగులను స్వదేశానికి తరలించడానికి ఇప్పటికే ఆరు విమానాలను జూన్ 5న చెన్నై, హైదరాబాద్‌కు... 6న అహ్మదాబాద్, ఢిల్లీకి... 7న మంగళూరు, చెన్నైలకు నడిపింది. జూన్ 11వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. సౌదీలోని దమ్మం నుంచి ఈ ఫ్లైట్‌లను ఆపరేట్ చేస్తోంది గల్ఫ్ ఏయిర్‌లైన్స్.
కాగా, సౌదీలోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో పెద్దదైన జుబైల్ ప్రాంతంలో పెట్రోకెమికల్, భారీ పరికరాల రంగాలకు చెందిన ఉత్పత్తులను తయారు చేసే తమ ఎక్స్‌పర్టైజ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో సుమారు పది వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు డైరెక్టర్ కేఎస్ షేక్ తెలియజేశారు. ఇక విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు దశల్లో 400 విమానాల ద్వారా దాదాపు 70 వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా జూన్ 10 నుంచి మూడో దశ ప్రారంభమైంది. దీనిలో భాగంగా 43 దేశాల నుంచి 60 వేల మంది ఎన్నారైలను భారత్‌కు తీసుకొచ్చేందుకు పౌరవిమానయాన శాఖ ఏర్పాట్లు చేసింది.