సౌదీ సంచలన నిర్ణయం.. రంజాన్ మాసంలోనూ...
ABN , First Publish Date - 2020-04-21T20:04:50+05:30 IST
సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందు జాగ్రత్త చర్యగా మక్కా నగరంలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేస్తూ ఆ దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

రంజాన్ మాసంలోనూ మక్కా మసీదుల మూసీవేత
రియాద్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందు జాగ్రత్త చర్యగా మక్కా నగరంలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేస్తూ ఆ దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రకు వచ్చిన భక్తులు ఈ మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ఈ ఏడాది రెండు మసీదుల్లోనూ ప్రార్థనలు నిలిపివేయాలని నిర్ణయించామని ఈ మసీదుల ప్రెసిడెంట్ జనరల్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తాజాగా ట్వీట్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిములు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రంజాన్ ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ షేఖ్ కోరారు.
కరోనా శరవేగంగా విస్తరిస్తున్నందున గత నెలలోనే సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర మసీదుల్లో ప్రార్థనలను ఆ దేశ సర్కారు నిలిపివేసింది. దీంతో రంజాన్ మాసంలోనూ మసీదులను మూసివేసి, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక సౌదీలో 'కొవిడ్-19' పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ మహమ్మారి ధాటికి ఆ దేశంలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటిపోయింది. ప్రస్తుతం సౌదీలో 10,484 మంది కరోనా బాధితులు ఉన్నారు. 1,490 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, ఈ మొత్తం కేసుల్లో 27 శాతం మాత్రమే సౌదీ పౌరులు ఉన్నారని, మిగతా 73 శాతం విదేశీయులేనని ఆరోగ్యశాఖ ప్రతినిధి మహ్మద్ అల్ అబ్దుల్ అలీ తెలియజేశారు.