సౌదీలో తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు.. గత 10 రోజులుగా..
ABN , First Publish Date - 2020-07-19T19:33:22+05:30 IST
సౌదీ అరేబియాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

రియాద్: సౌదీ అరేబియాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజులుగా 3వేలకు దిగువగా కొత్త కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ నుంచి వరుసగా 3వేల కంటే తక్కువ కేసులు నమోదువుతుండటం ఊరటనిచ్చే విషయమని అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కోలుకుంటున్నవారు కూడా పెరుగుతున్నట్లు గమనించామని పేర్కొన్నారు.
ఇక శనివారం దేశవ్యాప్తంగా 2,565 కొత్త కేసులు నమోదు కాగా... 3,057 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,48,416కు చేరితే... రికవరీలు 1,94,218 అయ్యాయి. కాగా, నిన్న సంభవించిన 40 కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకు సౌదీ వ్యాప్తంగా 2,447 మందిని ఈ మహమ్మారి కబళించింది. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా ఇప్పటికే ఆరు లక్షల మందిని బలిగొంది. అలాగే కోటి 44 లక్షల మందికి ప్రబలింది.