రష్యా వ్యాక్సిన్ వచ్చేసింది.. పేరేంటో తెలుసా ?

ABN , First Publish Date - 2020-08-12T13:42:06+05:30 IST

తా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది! ‘స్పుత్నిక్‌-వి’ పేరుతో సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. కరోనాకు టీకా అభివృద్ధి చేసిన మొదటి దేశంగా రష్యా నిలిచిందన్నారు.

రష్యా వ్యాక్సిన్ వచ్చేసింది.. పేరేంటో తెలుసా ?

కొవిడ్‌ నుంచి రెండేళ్లపాటు రక్షణ

ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌

వ్యాక్సిన్‌కు ‘స్పుత్నిక్‌-వి’గా నామకరణం

నేటి నుంచి ఫేజ్‌-3 ట్రయల్స్‌ ప్రారంభం

తన కుమార్తెకు ప్రయోగాత్మకంగా

వ్యాక్సిన్‌ ఇచ్చినట్టు తెలిపిన పుతిన్‌

మాస్కో, ఆగస్టు 11: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది! ‘స్పుత్నిక్‌-వి’ పేరుతో సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. కరోనాకు టీకా అభివృద్ధి చేసిన మొదటి దేశంగా రష్యా నిలిచిందన్నారు. ఈ టీకా వేయించుకుంటే రెండేళ్లపాటు కొవిడ్‌ నుంచి రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇవ్వగా.. ఆమె శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తిఅయినట్టు వెల్లడించారు. కొద్దిపాటి జ్వరం తప్ప ఆమెకు ఇతరత్రా ఎలాంటి సమస్యలూ రాలేదన్నారు. ఇద్దరిలో ఎవరికి వ్యాక్సిన్‌ ఇచ్చిందీ ఆయన చెప్పలేదు. ఇప్పటికే 20 దేశాలు 100 కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చాయని తెలిపారు. సెప్టెంబరులో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీస్థాయిలో ప్రారంభించి.. అక్టోబరు నుంచి ప్రజలకు ఇవ్వనున్నట్టు రష్యా అధికారులు చెప్పారు. 


శాస్త్రజ్ఞుల సందేహాలు!

రష్యా వ్యాక్సిన్‌ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి తొలి దశ పరీక్షల వివరాలే అందుబాటులో ఉన్నాయి. ఫేజ్‌-1 ట్రయల్స్‌ను 76 మందిపై జూన్‌ 17న ప్రారంభించారు. వారిలో చాలామంది  సైన్యానికి చెందినవారే. వ్యాక్సిన్‌ వల్ల వారిలో ఎలాంటి దుష్ప్రభావాలూ కలగలేదని రూపకర్తలు తెలిపారు. అంతే తప్ప ఆ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ సమాచారాన్నీ ప్రపంచానికి చూపలేదు. ఇక, రష్యాలో వచ్చిన వార్తా ్తకథనాల ప్రకారం రెండో దశ ట్రయల్స్‌ జూలై 13న ప్రారంభమయ్యాయి. ఆ ట్రయల్స్‌ పూర్తయినట్టు ఆగస్టు 3న ప్రకటించారు. వాటికి సంబంధించిన వివరాలూ వెల్లడించలేదు. మూడో దశ ట్రయల్స్‌ మొదలుపెట్టక ముందే వ్యాక్సిన్‌ను నమోదు చేసినట్టు ప్రకటించారు.


నిజానికి ఏ వ్యాక్సిన్‌నైనా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో అత్యంత కీలకమైనది మూడో దశ పరీక్షలే. తొలి రెండు దశల్లో తక్కువ మందికే  వ్యాక్సిన్‌ ఇస్తారు. వ్యాక్సిన్‌ సురక్షితమని, సమర్థమైనదని ఆ దశల్లో తేలిన తర్వాత.. మూడో దశలో వేలాది మందికి ఇస్తారు. ఇది కొన్ని నెలల తరబడి సాగే దశ. తొలి రెండు దశల్లో బయటపడని సమస్యలు ఈ దశలో వెలుగుచూస్తాయి. రష్యా వ్యాక్సిన్‌ విషయంలో ఈ మూడో దశ పరీక్షలు జరగలేదన్నదే శాస్త్రజ్ఞుల ఆందోళన. వ్యాక్సిన్‌ సామర్థ్యం తక్కువగా ఉంటే  ఆ టీకా వేయించుకున్నవారికి వైరస్‌ సోకితే ఏ మందులకూ, వ్యాక్సిన్లకూ లొంగదని.. మరికొందరు శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రష్యాకే చెందిన ‘అసోసియేషన్‌ ఆఫ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఆర్గనైజేషన్‌’ కూడా.. మూడో దశ ట్రయల్స్‌ పూర్తయ్యేదాకా ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలపవద్దని రష్యా ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసింది. కాగా.. మూడో దశ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభించన్నుట్టు ‘రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌’ అధిపతి కిరిల్‌ ద్మిత్ర్యేవ్‌ తెలిపారు. అంటే మూడో దశ పరీక్షలు సాగుతుండగానే టీకాలు ఇచ్చే ప్రక్రియ మొదలుపెడతారన్నమాట.  


పరీక్షలు కొనసాగుతాయ్‌

వ్యాక్సిన్‌ సిద్ధమని పుతిన్‌ ప్రకటించినప్పటికీ.. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ట్రయల్స్‌ కొనసాగుతాయని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురష్కో తెలిపారు.  రష్యాలోనే కాక తమ దేశంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న ఐదు దేశాల్లో కూడా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కొనసాగుతుందని.. అక్కడ ఏడాదికి 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తామని కిరిల్‌ ద్మిత్ర్యేవ్‌ చెప్పారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చలు

వ్యాక్సిన్‌కు ప్రీక్వాలిఫికేషన్‌ (అనుమతి) కోసం చర్చలు జరుగుతున్నాయని, ఎంతవరకూ సురక్షితం అనే అంశంపై సమగ్ర సమీక్ష, అంచనా తర్వాతే అనుమతిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధికార ప్రతినిధి తారిక్‌ జసరెవిక్‌  తెలిపారు. మరోవైపు పుతిన్‌ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితం, అవివేకంతో కూడుకున్నవని పలువురు శాస్త్రవేత్తలు మండిపడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తే ప్రజారోగ్యంపై విపత్కర ప్రభావాలు ఉంటాయని ఒక శాస్త్రవేత్త హెచ్చరించారు. కాగా, వ్యాక్సిన్‌ సురక్షితమైనదేనా, ప్రభావవంతమైనదేనా అనే విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించాలని ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు.


ఆ టీకా నేను వేయించుకుంటా: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు

రష్యా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల శాస్త్రవేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో భాగం కావడానికి తాను సిద్ధమని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్‌ ప్రకటించారు. రష్యా ఆ వ్యాక్సిన్‌ను ఫిలిప్పీన్స్‌కు ఇచ్చేందుకు లేదా ఫిలిప్పీన్స్‌లోనే ఎదైనా ఫార్మా సంస్థతో కలిసి ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. రష్యా వ్యాక్సిన్‌పై ప్రజల్లో భయం పోగొట్టడానికి తాను వ్యాక్సిన్‌ తీసుకుంటానని చెప్పారు.


ఆ పేరే ఎందుకు?

తమ వ్యాక్సిన్‌కు రష్యా తొలి ఉపగ్రహమైన స్పుత్నిక్‌ పేరు పెట్టారు. అయితే ఈ పేరు ఇతర దేశాలకే పరిమితం. రష్యాలో దీని అసలు పేరు (బయొలాజికల్‌ నేమ్‌) ‘గమ్‌-కొవిడ్‌-వ్యాక్‌ ల్యో’తోనే వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌, వెక్టర్‌ వ్యాక్సిన్‌.. ఇలా వ్యాక్సిన్లను రకరకాల పద్ధతుల్లో అభివృద్ధి చేస్తారు. వీటిలో రష్యా ఎంచుకుంది ‘టూ-వెక్టర్‌’ విధానం. 2015 నుంచి రష్యా శాస్త్రజ్ఞులు ఈ తరహా పరిజ్ఞానంపై విస్తృతస్థాయిలో చేస్తున్న అధ్యయనం కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనలో ఎంతగానో ఉపకరించింది. ఇప్పటికే క్షుణ్నంగా తెలిసిన వైర్‌సలను వాహకాలుగా ఉపయోగించుకుని.. కొత్త వైర్‌సల జన్యు పదార్థాలను శరీరంలో ప్రవేశపెట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసే పద్ధతి ఇది.   రష్యా శాస్త్రవేత్తలు ఏడీ-5, ఏడీ-26 అనే రెండు రకాల ఎడినోవైరల్‌ వెక్టర్లను ఉపయోగించి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.  

Updated Date - 2020-08-12T13:42:06+05:30 IST