రూ. 159 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి.. ఒక్క రోగిని కూడా చూడకుండానే..

ABN , First Publish Date - 2020-05-26T03:38:25+05:30 IST

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదైన విషయం తెలిసిందే.

రూ. 159 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి.. ఒక్క రోగిని కూడా చూడకుండానే..

న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్ కరోనాకు కేంద్రంగా మారింది. ఇదే సమయంలో కరోనా పేషంట్ల కోసం ఒక్క న్యూయార్క్ నగరంలోనే అనేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వం అనేక తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించింది. అయితే వీటిలో చాలా ఆసుపత్రులు వందల కోట్ల వ్యయంతో నిర్మించగా.. అనుకున్న స్థాయిలో పేషంట్లకు చికిత్స అందించలేక పోయాయి. కరోనా పేషంట్ల కోసం న్యూయార్క్ నగరంలో 21 మిలియన్ డాలర్ల(రూ. 159 కోట్ల 54 లక్షలు)తో నిర్మించిన ఫీల్డ్ ఆసుపత్రి ఒక్క పేషంట్‌కు కూడా చికిత్స అందించకుండానే మూతపడింది. మరోపక్క ఏప్రిల్ 11న ప్రభుత్వం న్యూయార్క్ నగరంలోని టెన్నిస్ సెంటర్‌ను మెడికల్ ఫెసిలిటి కింద మార్చింది. ఈ ఆసుపత్రిని మళ్లీ టెన్నిస్ సెంటర్‌గా మార్చేందుకు 19.8 మిలియన్ డాలర్ల(రూ. 150 కోట్ల 14 లక్షలు) ఖర్చు అయింది. పైగా ఈ ఆసుపత్రిలో కేవలం 79 మంది పేషంట్లకు మాత్రమే మొత్తంగా చికిత్స అందించారు. 


ఇదిలా ఉంటే.. బ్రూక్లిన్ ఆసుపత్రిని టెక్సాస్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెని నిర్మించింది. ఈ ఆసుపత్రి ఏప్రిల్‌లోనే పూర్తి చేయాల్సి ఉన్నా.. మే 4 వరకు తెరుచుకోలేదు. ఒక్క పేషంట్ కూడా లేకపోవడంతో ఈ ఆసుపత్రిని గత వారం మూసివేశారు. ఈ రెండు ఆసుపత్రులకు అయిన ఖర్చును ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీనే భరించే అవకాశం ఉంది. ఈ రెండు ఆసుపత్రులతో పాటు న్యూయార్క్ వ్యాప్తంగా అనేక ఆసుపత్రులు కనీసం ఒక్క పేషంట్‌కు కూడా చికిత్స అందించకుండానే మూతపడ్డాయి. దాదాపు 350 మిలియన్ డాలర్ల(రూ. 2 వేల 654 కోట్ల 13 లక్షలు)తో నిర్మించిన అనేక తాత్కాలిక ఆసుపత్రులు తక్కువ సంఖ్యలోనే పేషంట్లకు చికిత్స అందించి మూతపడ్డాయి. కాగా.. అతితక్కువ సమయంలోనే పేషంట్ల కోసం భారీ వ్యయంతో ఆసుపత్రులను నిర్మించాల్సి వచ్చిందని ప్రభుత్వాధికారి ఆవెరీ కొహెన్ తెలిపారు. తాము డబ్బు కంటే కూడా ప్రజల ప్రాణాల గురించే ఎక్కువగా ఆలోచించామని ఆయన అన్నారు.

Updated Date - 2020-05-26T03:38:25+05:30 IST