హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట

ABN , First Publish Date - 2020-04-15T03:36:28+05:30 IST

హెచ్1బీ వీసా గడువును అరవై రోజుల నుంచి ఎనిమిది నెలలకు పెంచుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికాను కరోనా

హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట

వాషింగ్టన్: హెచ్1బీ వీసా గడువును అరవై రోజుల నుంచి ఎనిమిది నెలలకు పెంచుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన అనేక మంది పరిస్థితి సందిగ్దంలో పడింది. కంపెనీలు మూతపడుతుండటంతో ప్రాజెక్టులు లేక అనేక మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా హెచ్1బీ వీసాదారులపైనే పడుతోంది. విదేశీయులు అమెరికాలో పనిచేసుకునేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాను జారీ చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది హెచ్1బీ వీసాదారులను ప్రాజెక్టుల నుంచి కంపెనీలు తొలగిస్తున్నాయి. ఒకవేళ హెచ్1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే అమెరికాలో 60 రోజులు ఉండటానికి అనుమతి ఉంటుంది. ఈ 60 రోజుల్లో మరో ఉద్యోగం చూసుకోకపోతే అమెరికాను విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. 


మరోపక్క ఉద్యోగం కోల్పోకుండా హెచ్1బీ వీసా గడువు తీరినా.. వేరే వీసాకు మారాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల్లో వేరే ఉద్యోగం చూసుకోవడం, వేరే వీసాకు మారడం కష్టతరంగా ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో హెచ్1బీ వీసాపై అత్యధికంగా  భారతీయులే పనిచేస్తున్నారు. దీంతో వీరందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక మంది వీసా గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. మరోపక్క భారత ప్రభుత్వం కూడా ఇదే విషయంపై అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. భారత ప్రభుత్వం కోరికను మన్నించి అమెరికా ప్రభుత్వం హెచ్1బీ, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులకు ఊరటనిస్తూ ప్రకటన చేసింది. హెచ్1బీ వీసాపై ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును ఎనిమిది నెలలకు పొడిగిస్తున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-04-15T03:36:28+05:30 IST