ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2020-07-18T14:07:49+05:30 IST
తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి బడుల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. దీంతో పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది.

ఐచ్ఛిక అంశంగా చేర్చిన ప్రభుత్వం
మెల్‌బోర్న్, జూలై 17: తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి బడుల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. దీంతో పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది. ఈ ప్రకటన యావత్ ప్రపంచంలోని తెలుగు వారికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ, తమిళ భాషలకే అక్కడి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా ఆ జాబితాలో నాలుగో భాషగా తెలుగు చేరింది. దీంతో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాల్లోని తెలుగు వారికి ప్రయోజనం కలగనుంది.
తాజా ఆదేశాలతో తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో ఐదు పాయింట్లు అదనంగా ఇవ్వనున్నారు. ఇకపై శాశ్వత నివాసం కోసం తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన పట్ల స్థానిక తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలుగు సమాఖ్య సభ్యులు, తెలుగుమల్లి, భువన విజయం వంటి సాంస్కృతిక సంస్థలు ఏళ్లుగా చేస్తున్న కృషికి దక్కిన ఫలితం ఇది.