ఎన్నికలు జరిగే రోజు రాత్రి.. ట్రంప్ ప్లాన్ ఏంటంటే...

ABN , First Publish Date - 2020-11-03T18:35:53+05:30 IST

నవంబర్ 3... అమెరికా చరిత్రలో అతి కీలకమైన రోజు.. ట్రంప్‌ను అమెరికన్ ఓటర్లు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా..? లేక నీ పాలన మాకిక చాలు అని ట్రంప్‌ను సాగనంపి వైట్‌హౌస్‌లోకి జో బైడెన్‌ను ఆహ్వానిస్తారా..?

ఎన్నికలు జరిగే రోజు రాత్రి.. ట్రంప్ ప్లాన్ ఏంటంటే...

వాషింగ్టన్: నవంబర్ 3... అమెరికా చరిత్రలో అతి కీలకమైన రోజు.. ట్రంప్‌ను అమెరికన్ ఓటర్లు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా..? లేక నీ పాలన మాకిక చాలు అని ట్రంప్‌ను సాగనంపి వైట్‌హౌస్‌లోకి జో బైడెన్‌ను ఆహ్వానిస్తారా..? అన్నది తేలే రోజు.. ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. తాను విజయం సాధించడం అంత ఈజీ కాదని ట్రంప్‌కు కూడా తెలుసు.. అందుకే తన వ్యాఖ్యలకు, విమర్శలకు, ప్రసంగాలకు.. 2016 ఎన్నికల నాటికంటే మరింతగా ఆయన పదునుపెట్టారు. ‘నేను ఓడిపోతే అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించే ప్రక్రియ అంత ఈజీగా ఉండదు..’ అని ట్రంప్ గతంలోనే చెప్పారు.. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 3వ తేదీ రాత్రి ట్రంప్ ఏం చేయబోతున్నారన్నదానిపై అమెరికా అంతటా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 


‘ఎన్నికలు జరిగే రోజు రాత్రి మనం పార్టీ చేసుకుందాం.. గెలుపును ఆస్వాదిద్దాం.. ట్రంప్‌తో కలిసి ఎలక్షన్ నైట్ పార్టీలో పాల్గొనేందుకు రెడీగా ఉండండి..’.. అంటూ కొద్ది రోజుల క్రితం ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ హడావిడీ చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌లోని ట్రంప్‌కు బాగా ఇష్టమైన ఓ ప్రఖ్యాత స్టార్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ కార్యక్రమం పేరిట ఫండ్ రైజింగ్ కూడా జరిగింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఈ మేరకు ఈమెయిల్స్ కూడా పంపారు. అయితే ప్రస్తుతం కరోనా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో.. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పార్టీల్లో పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడటం నిషేధం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఎలక్షన్ నైట్ పార్టీ’ని ట్రంప్ టీమ్ రద్దు చేసింది.. 


మరి నవంబర్ 3న రాత్రి ట్రంప్ ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. ‘ఎన్నికలు జరిగే రోజు రాత్రి అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉంటారు. అతి కొద్ది మంది ముఖ్యులతో కలిసి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తుంటారు..’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలియహ్ మెక్‌ఎనన్నీ తేల్చిచెప్పారు. ఓటింగ్ సరళిని బట్టి తన బృందంతో కలిసి ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటారట..

Updated Date - 2020-11-03T18:35:53+05:30 IST