అగ్ర‌రాజ్యానికి మ‌హా విప‌త్తుగా 'క‌రోనా'.. యూఎస్‌ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా..

ABN , First Publish Date - 2020-04-12T16:55:21+05:30 IST

ప్ర‌పంచ దేశాల‌ను విషాదంలో నెట్టేసిన‌ మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్‌ అమెరికాలో క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటున్న 'కొవిడ్‌-19' అగ్ర‌రాజ్యాన్ని అల్లాడిస్తోంది.

అగ్ర‌రాజ్యానికి మ‌హా విప‌త్తుగా 'క‌రోనా'.. యూఎస్‌ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా..

వాషింగ్ట‌న్‌: ప్ర‌పంచ దేశాల‌ను విషాదంలో నెట్టేసిన‌ మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్‌ అమెరికాలో క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటున్న 'కొవిడ్‌-19' అగ్ర‌రాజ్యాన్ని అల్లాడిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 35 వేల పాజిటివ్‌ కేసులు న‌మోదు కావ‌డం ఈ మహ‌మ్మారి యూఎస్‌లో ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందో తెలియ‌జేస్తోంది. అక్క‌డ‌ కొవిడ్-19 బారిన ప‌డుతున్న వారి సంఖ్య‌ నానాటికీ మ‌రింత వేగంగా పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. 


ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ క‌రోనా విజృంభ‌ణ‌ను దేశ వ్యాప్త విప‌త్తుగా ప్ర‌క‌టించారు. అమెరికా చ‌రిత్ర‌లో ఇలా చేయ‌డం ఇదే తొలిసారి. జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన ట్రంప్‌, దేశంలోని 50 రాష్ట్రాల్లో మ‌హా విప‌త్తు ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల్లో మ‌హా విప‌త్తును ప్ర‌క‌టిస్తూ వైట్‌హౌజ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రాలు నేరుగా వైట్‌హౌజ్ నుండి వ‌చ్చే నిధుల‌ను వాడుకోవ‌చ్చు. ఇత‌ర అత్యవ‌స‌ర సేవ‌ల‌ను కూడా ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ‌మే ప‌ర్య‌వేక్షిస్తుంది. 


ఇక అగ్రరాజ్యంలో ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య 5 ల‌క్ష‌లు దాటిపోయింది. సుమారు 20,580 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టికే మ‌ర‌ణాల్లో ఇట‌లీ, స్పెయిన్ల‌ను యూఎస్ దాటేసింది. దీంతో అమెరిక‌న్ల‌కు కంటిమీద క‌నుకు లేకుండా పోతోంది. ఇక  కొవిడ్‌-19కు కేంద్ర స్థానంగా మారిన న్యూయార్క్‌లో మృత్యు హేల కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 1,81,144 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా... 8,627 మంది ప్రాణాలొదిలారు. 

  


Updated Date - 2020-04-12T16:55:21+05:30 IST