ప్రధాని మోదీని మెచ్చుకున్న ట్రంప్.. కరోనాపై భారత్ పోరు భేష్
ABN , First Publish Date - 2020-04-08T18:22:20+05:30 IST
మలేరియా నిర్మూలనకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భారత్ పాక్షికంగా సడలించింది.

వాషింగ్టన్: మలేరియా నిర్మూలనకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భారత్ పాక్షికంగా సడలించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) మంగళవారం సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. కాగా, భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ట్రంప్... ‘‘29 మిలియన్లకు పైగా హెచ్‌సీక్యూ డోసులు కొనుగోలు చేశాం. ఇందులో ఎక్కువగా భారత్ నుంచే వచ్చాయి. దీనిపై భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఆయన నిజంగా చాలా మంచివారు. వాస్తవానికి భారత్‌లో కూడా ఇప్పుడు ఇవి చాలా అవసరం కావడంతో.. వాటిని పంపుతారా లేదా అని నేను మోదీని అడిగాను. అయినా మంచి మనసుతో వాటిని పంపుతున్నారు. ఇక్కడ చాలా మందికి ఆ మందులు అవసరం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో కలిసి తాము వ్యాక్సీన్లు తయారు చేసేపనిలో ఉన్నామనీ... వాటిని పరీక్షించాల్సి ఉందని ట్రంప్ ఈ సందర్భంగా తెలియజేశారు. మలేరియా ప్రభావిత దేశాల్లో ఇలాంటి సమస్యలు సాధారణమే అయినందున అక్కడ కరోనా ప్రభావం అంతగా పడలేదనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే కొవిడ్-19 మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటం భేష్ అన్నారు.
ఇక హెచ్‌సీక్యూ ఎగుమతికి సహకరించకపోతే- భారత్‌పై ప్రతీకారం తప్పదని ట్రంప్ సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించిన విషయం తెలిసిందే.‘‘హెచ్‌సీక్యూ సరఫరా చేయరాదన్న నిర్ణయం వారు తీసుకున్నట్లు నాకు సమాచారం లేదు. ప్రధాని మోదీతో నేను మాట్లాడినప్పుడు సంభాషణ సుహృద్భావ రీతిలో నడిచింది. హెచ్‌సీక్యూ మాత్రల ఎగుమతికి సహకరించాలని నేను కోరాను. భారత్ మా నుంచి ఏళ్లతరబడి ఎంతో సాయం పొందింది. అందుచేత అడిగాను. సరఫరా చేయరాదన్న నిర్ణయాన్ని వారు తీసుకుంటే ఆశ్చర్యమే. అది వారి ఇష్టం... అయితే తప్పనిసరిగా దానికి ప్రతీకారం ఉంటుంది’’ అని మీడియాతో అన్నారు. ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భారత్ పాక్షికంగా సడలించడంతో ట్రంప్ మాటమార్చి ప్రధాని మోదీని ప్రశంసించారు.