‘శోభానాయుడి ఆకస్మిక మరణం కళారంగానికి తీరని లోటు’

ABN , First Publish Date - 2020-10-15T01:58:45+05:30 IST

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తానా మాజీ అధ్యక్షుడు, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. తోటకూర ప్రసా

‘శోభానాయుడి ఆకస్మిక మరణం కళారంగానికి తీరని లోటు’

వాషింగ్టన్: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తానా మాజీ అధ్యక్షుడు, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ సంతాపం తెలిపారు. ‘ఆమె మరణం కళారంగానికి తీరని లోటు’ అని అన్నారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాకుండా శోభానాయుడుతో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. శోభానాయుడి స్వీయ దర్శకత్వంలో డల్లాస్ నగరంలో తాము ఓ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ‘సర్వం సాయిమయం’ అనే కూచిపూడి నృత్య ప్రదర్శనలో శోభానాయుడు.. సాయిబాబాగా నటించి, అందరి మన్ననలను పొందిన తీరు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు.



అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్‌‌లో విశాఖపట్నంలో జరిగిన ‘6వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం’ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభానాయుడిని ‘కూచిపూడి కళారత్న’ పురస్కారంతో సన్మానించినటినట్లు చెప్పారు. అలా ఆమెను సన్మానించుకోగలగడం తమ అదృష్టం అన్నారు. తొలిరోజుల్లో పద్మభూషణ్ వెంపటి చిన సత్యం వద్ద శోభానాయుడు కూచిపూడిలో శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. ఆయన నిర్వహించిన అన్ని నృత్య రూపాలలో ప్రధాన పాత్రలను ఆమె పోషించినట్లు తెలిపారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రలలో తన అద్భత నాట్య ప్రతిభతో రాణించినట్లు చెప్పారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువుగా హైదరాబాద్‌లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపల్‌గా నాట్యంలో అభిరుచి ఉన్న అనేక వేలమంది పిల్లలకు ఆమె శిక్షణ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఆమె దగ్గర శిక్షణ తీసుకున్న వారు ప్రస్తుతం దేశ విదేశాల్లో కూడిపూడిలో రాణిస్తున్నారని డా.తోటకూర ప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-15T01:58:45+05:30 IST