మొదటిసారి ఫేస్‌మాస్క్‌ ధరించిన పోప్ ఫ్రాన్సిస్

ABN , First Publish Date - 2020-10-21T11:16:40+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో కూడా ఫేస్‌మాస్క్ ధరించడం లేదనే విమర్శలు రావడంతో పోప్ ఫ్రాన్సిస్ మొట్టమొదటిసారిగా

మొదటిసారి ఫేస్‌మాస్క్‌ ధరించిన పోప్ ఫ్రాన్సిస్

రోమ్: బహిరంగ ప్రదేశాల్లో కూడా ఫేస్‌మాస్క్ ధరించడం లేదనే విమర్శలు రావడంతో పోప్ ఫ్రాన్సిస్ మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఈవెంట్‌లో ఫేస్‌మాస్క్‌తో కనిపించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఇతర మత పెద్దలతో కలిసి మంగళవారం ప్రేయర్ సర్వీస్‌లో పాల్గొన్నారు. అరకోలీలోని రోమ్ బాసిలికాలో ఈ ప్రేయర్ సర్వీస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అన్ని రాజకీయాల ప్రాధాన్యతా శాంతి. శాంతి స్థాపనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని దేవుడు వదలడు. వాళ్లందరూ బాధ్యత వహించాల్సిందే’ అని అన్నారు. 


ఇటలీలో రోజురోజుకూ కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం ఒక్కరోజే ఇటలీ వ్యాప్తంగా 10,874 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 9,338 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇతర క్రైస్తవ పెద్దలతో కలిసి పోప్ ఫ్రాన్సిస్ ప్రేయర్ సర్వీస్‌‌ నిర్వహించారు. మరోపక్క హిందు, సిక్కు, ముస్లిం పెద్దలు సైతం రోమ్‌లోని ఇతర ప్రదేశాల్లో శాంతి కోసం ప్రార్థనలు చేశారు. పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొంటూ కనీసం ఫేస్‌మాస్క్ ధరించడం లేదంటూ పోప్ ఫ్రాన్సిస్‌పై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పోప్ బాడీగార్డులు నలుగురు ఇటీవల కరోనా బారిన పడటంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి. ఈ కారణంతోనే ఆయన ఫేస్‌మాస్క్ ధరించినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-10-21T11:16:40+05:30 IST