గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ఈ రెండు రాష్ట్రాల్లో సీన్ రివర్స్!

ABN , First Publish Date - 2020-06-26T02:55:56+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్టు అనేక

గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ఈ రెండు రాష్ట్రాల్లో సీన్ రివర్స్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్టు అనేక సర్వేలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారితో పాటు జార్జ్ ఫ్లాయిడ్ హత్య ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కరోనాను ట్రంప్ ఎదుర్కొన్న తీరు.. కరోనాకు సంబంధించి ఆయన చెప్పే మాటలు ఆయన కొంప ముంచుతున్నాయి. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ట్రంప్‌కు, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు ఏ విధంగా ఉన్నదా అనే దానిపై పలు సర్వేలు జరుగుతున్నాయి. విస్కాన్సిన్, ఒహాయో రాష్ట్రాల్లో తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే జో బైడెన్‌కు అధిక మద్దతు లభించినట్టు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ఈ రెండు రాష్ట్రాల్లోనే ఆయనకు వ్యతిరేకత పెరగడం విశేషం. 


మార్క్‌వెట్ యూనివర్శిటి లా స్కూల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. విస్కాన్సిన్‌లో 49 శాతం ప్రజలు జో బైడెన్‌కు మద్దతుగా నిలవగా.. ట్రంప్ 41 శాతం మంది మద్దతు పొందారు. మే నెల ప్రారంభంలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు 43 శాతం మద్దతు రాగా.. నెల రోజుల్లోనే 2 శాతం మంది ప్రజల మద్దతును ట్రంప్ పోగొట్టుకున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ట్రంప్ ప్రవర్తించిన తీరు కారణంగానే ఆయనపై వ్యతిరేకత పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరోపక్క ఒహాయో రాష్ట్రంలో జో బైడెన్‌కు 46 శాతం మంది ప్రజల మద్దతు లభిస్తే.. ట్రంప్‌కు అనుకూలంగా 45 శాతం మంది ఉన్నారు. కరోనా మహమ్మారి, జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు సంబంధించిన అంశాల్లో ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికి.. ఎకానమీని మాత్రం ట్రంప్ సమర్థవంతంగా నడిపించారని ఎక్కువ శాతం ప్రజలు చెబుతున్నారు.

Updated Date - 2020-06-26T02:55:56+05:30 IST