అమెరికా ప్రజలకు ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-07-05T04:17:56+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, అమెరికా ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర

అమెరికా ప్రజలకు ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, అమెరికా ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 244వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, భారత్ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా.. అమెరికన్లు ప్రతి ఏడాది జులై నాలుగో తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. దీన్నే వారు ‘ది ఫోర్త్ ఆఫ్ జులై’ అని పిలుచుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరేడ్ కార్యక్రమాలకు, వేడుకలకు అమెరికా దూరంగా ఉంది. అమెరికాలో నిత్యం 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. రానున్న రోజుల్లో నిత్యం లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికాలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించక ముందు ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించలేని ఘనతను అమెరికా సాధించినట్టు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం చైనా నుంచి వచ్చిన వైరస్ కారణంగా అమెరికాలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనాను అమెరికా సమర్థవంతంగా ఎదుర్కొంటోందని.. ఉద్యోగాల విషయంలో తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటోందన్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 29 లక్షల కేసులు నమోదు కాగా.. లక్షా 30 వేల మంది మరణించారు.

Updated Date - 2020-07-05T04:17:56+05:30 IST