యూరప్‌లో టీకా కోలాహలం

ABN , First Publish Date - 2020-12-28T13:02:25+05:30 IST

కరోనాతో చిగురుటాకులా వణికి.. కోలుకుంటున్న దశలో కొత్త స్ట్రెయిన్‌ బారినపడిన యూర్‌పలో ఓ ఆశారేఖ. ఆదివారం అక్కడి

యూరప్‌లో టీకా కోలాహలం

  • పలు దేశాల్లో పంపిణీ ప్రారంభం

లండన్‌, డిసెంబరు 27: కరోనాతో చిగురుటాకులా వణికి.. కోలుకుంటున్న దశలో కొత్త స్ట్రెయిన్‌ బారినపడిన యూర్‌పలో ఓ ఆశారేఖ. ఆదివారం అక్కడి పలు దేశాల్లో ఫైజర్‌-బయో ఎన్‌టెక్‌ టీకా పంపిణీ ప్రారంభమైంది. శనివారమే జర్మనీ, హంగేరీ, స్లొవేకియా దేశాల్లో ఈ ప్రక్రియ మొదలవగా.. మిగతాచోట్ల ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. తొలి దశలో భాగంగా వైద్య సిబ్బంది, వృద్ధులకు టీకా వేశారు. మొత్తం 27 దేశాల్లోనూ టీకా వేస్తుండటంతో ఒకవిధమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ‘నేను ఈ రోజు ఓ పౌరురాలిగా టీకా కేంద్రం వద్ద వరుసలో నిలుచున్నా. వృత్తిరీత్యా ఓ నర్సునైన నేను మా వర్గానికి, సైన్స్‌పై నమ్మకం ఉన్న ఆరోగ్య రంగ ప్రతినిధిని’ అని ఇటలీ రాజధాని రోమ్‌కు చెందిన క్లాడియా అలివెర్నిన్ని (29) వ్యాఖ్యానించడం దీనికి నిదర్శనం. మరోవైపు వ్యాక్సిన్‌ను ‘గేమ్‌ ఛేంజర్‌’గా ఆస్ట్రియా చాన్స్‌లర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ అభివర్ణించారు. ‘ఈ రోజుతో మహమ్మారి అంతమైనట్లు కాదు కానీ, విజయానికి ఇది మొదటి అడుగు’ అని పేర్కొన్నారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ స్పెయిన్‌లో ఆదివారం తొలి డోసును మాడ్రిడ్‌ శివారు ప్రాంతానికి చెందిన 96 ఏళ్ల అర్సెలీ హిడాల్గోకు ఇచ్చారు. జర్మనీలో తొలి టీకాను.. వృద్ధాశ్రమంలో ఉంటున్న 101 ఏళ్ల మహిళకు వేశారు. రెండో ప్రపంచ యుద్ధ వీరుడి పక్కన కూర్చుని.. చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాని ఆండ్రెజ్‌ బాబిస్‌ ఉదయమే టీకా వేయించుకున్నారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ శివారులో నిరుపేదలు నివసించే ప్రాంతంలోని నర్సింగ్‌ హోం నుంచి టీకా పంపిణీని ప్రారంభించారు. కాగా, బెల్జియంలోని పరిశ్రమ నుంచి ఫైజర్‌ టీకాను యూరప్‌ దేశాలకు చేరవేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఒక్కో దేశానికి 10 వేల డోసుల చొప్పున మాత్రమే కేటాయించారు. కొత్త స్ట్రెయిన్‌ ఉత్తర అమెరికా ఖండంలోని కెనడాకూ పాకింది. ఒంటారియో ప్రావిన్స్‌కు చెందిన దంపతులు కొత్త స్ట్రెయిన్‌ బారినపడ్డారు. దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు ఏడుకు చేరడంతో.. విదేశీయుల రాకపై జపాన్‌ తాత్కాలికంగా నిషేధం విధించింది. 



చివరి మహమ్మారి కాదు: డబ్ల్యుహెచ్‌వో 

‘‘కరోనా చివరి మహమ్మారేమీ కాదు. దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకునే దిశగా మనుషుల ఆలోచనా తీరు మారకుంటే.. ప్రజారోగ్యం విషయంలో ప్రపంచం మరిన్ని ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రెయేసస్‌ స్పష్టం చేశారు. అంటువ్యాధుల నివారణ సన్నద్ధతపై తొలిసారిగా జరిగిన అంతర్జాతీయ దినం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా.. మానవ తప్పిదాలపై హెచ్చరించారు. ‘‘మానవ జీవితంలో మహమ్మారులు, అంటువ్యాధుల దాడి  జరుగుతూనే ఉంటుంది. వాతావరణ మార్పులపై ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలి. పశుపక్ష్యాదులను కాపాడుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో కూడా విచారం తప్పదు. భూమి నివాసయోగ్యాన్ని కోల్పోతుంది’’ అని  టెడ్రోస్‌ ఘెబ్రెయేసస్‌ అన్నారు.


Updated Date - 2020-12-28T13:02:25+05:30 IST