'ఫైజర్' వ్యాక్సినేషన్ దిశగా అగ్రరాజ్యం అడుగులు !
ABN , First Publish Date - 2020-12-11T17:24:54+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.
ఫైజర్ టీకాకు అమెరికా నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేచ్చేందుకు యూఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ దిశగా అమెరికా ముందడుగు వేసింది. తమ దేశానికి చెందిన ఫైజర్ సంస్థ, జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో కలిసి రూపొందించిన కొవిడ్ టీకా విస్తృత వినియోగానికి ప్రభుత్వ నిపుణుల కమిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ సిఫార్సులకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం లభించగానే ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. పదహారేళ్లు, ఆపై వయసు గల పిల్లలు, పెద్దవారికి అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకా సురక్షితమైంది, సమర్థవంతమైందని 17-4 ఓట్ల తేడాతో నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.
కాగా, ఫైజర్ టీకా మూడో దశ ట్రయల్స్‌లో సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు ఎఫ్‌డీఏ వెల్లడించిన విషయం తెలిసిందే. నలుగురు వాలంటీర్లు తాత్కాలిక ముఖ పక్షవాతానికి గురికావడం ఎఫ్‌డీఏ గుర్తించింది. అలాగే ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభించిన బ్రిటన్‌లో కూడా అలెర్జీ ఉన్నవారిపై ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్లు వెల్లడైంది. ఇలాంటి పరిస్థితులలో ఈ టీకా వినియోగానికి అమెరికా నిపుణుల కమిటీ ఓకే చెప్పినా.. ఎఫ్‌డీఏ ఆమోదం తెలుపుతుందో లేదో చూడాలి. ఇక ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌తో పాటు బహ్రెయిన్, కెనడా, సౌదీ అరేబియా కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చాయి.