ఏడాది చివరికల్లా మార్కెట్‌లోకి వ్యాక్సిన్: అమెరికా ఫార్మా కంపెనీ

ABN , First Publish Date - 2020-09-15T00:52:34+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరిలోపే అందుబాటులోకి రావొచ్చంటూ అమెరికాకు

ఏడాది చివరికల్లా మార్కెట్‌లోకి వ్యాక్సిన్: అమెరికా ఫార్మా కంపెనీ

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరిలోపే అందుబాటులోకి రావొచ్చంటూ అమెరికాకు చెందిన ఫైజర్ అనే ప్రముఖ ఫార్మా కంపెనీ వెల్లడించింది. అమెరికాలో మోడెర్నా సంస్థతో పాటు ఫైజర్ సంస్థ కూడా కరోనా వ్యాక్సిన్ రేసులో ముందుంది. ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాక్సిన్‌ అభివృద్ధిపై మాట్లాడారు. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థ భాగస్వామ్యంతో వ్యాక్సిన్ తయారుచేస్తున్నామని.. తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సురక్షితం అని చెప్పారు. 2021 రాకముందే తమ సంస్థకు చెందిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని ఆల్బర్ట్ అభిప్రాయపడ్డారు. అక్టోబర్ చివరికల్లా తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సామర్థ్యం ఏంటనేది 60 శాతం వరకు తెలుస్తుందన్నారు. 


అక్టోబర్ నాటికే వ్యాక్సిన్ పూర్తి సురక్షితం అని చెప్పలేమని.. అనుకూలమైన ఫలితాలు వస్తే వ్యాక్యిన్‌కు త్వరగా ఆమోదం లభిస్తుందన్నారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ విడుదలపై ప్రభుత్వ ఒత్తిడి ఉండకూడదనే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫండ్స్‌ను తీసుకోలేదని ఆల్బర్ట్ చెప్పారు. తమ సంస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తాను కోరుకున్నానన్నారు. కాగా.. ఫైజర్ సంస్థ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ వారంలో 30 వేల మంది పేషంట్లను తీసుకోనుంది. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో 16 ఏళ్ల యువకులతో పాటు హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీ ఉన్న వారిని కూడా భాగం చేయాలని సంస్థ భావిస్తోంది. అంతేకాకుండా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వర్ణాలను కూడా సంస్థ పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రస్తుతం తమ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తెల్లజాతీయులు అని.. 40 శాతం మంది వివిధ వర్ణాలకు చెందిన వారని ఆల్బర్ తెలిపారు. 

Updated Date - 2020-09-15T00:52:34+05:30 IST