కొత్త స్ట్రెయిన్‌పై తమ టీకాలను పరీక్షించనున్న ఫైజర్, మోడెర్నా..

ABN , First Publish Date - 2020-12-22T21:41:17+05:30 IST

ఇప్పటికే ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ రూపంలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

కొత్త స్ట్రెయిన్‌పై తమ టీకాలను పరీక్షించనున్న ఫైజర్, మోడెర్నా..

వాషింగ్టన్: ఇప్పటికే ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ రూపంలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌లో బయటపడ్డ కరోనా కొత్త స్ట్రెయిన్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు నాలుగైదు దేశాల్లో స్ట్రెయిన్ కేసులు గుర్తించడం జరిగింది. కొవిడ్ కంటే కూడా ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించడం జరిగింది. ఇక కరోనా కోసం పరిశోధకులు కనుగొన్న టీకాలు దీనిపై పని చేస్తాయా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు త్వరలోనే కొత్త స్ట్రెయిన్‌పై తమ టీకాలను పరీక్షించనున్నట్లు తెలిపాయి.


ఇక ఫైజర్, మోడెర్నా రెండు కరోనా వ్యాక్సిన్లకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, ఈ టీకాలు వినియోగానికి రావడానికే కంటే ముందే ఆయా కంపెనీలు కొవిడ్ వైరస్ రూపాంతరలపై కూడా ఇవి పని చేయగలవని పేర్కొన్నాయి. తాజాగా ఆయా సంస్థలు మరోసారి ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పరీక్షలు చేయబోతున్నాయి. దీంతో కొత్త స్ట్రెయిన్‌ను ఈ రెండు వ్యాక్సిన్లు నిరోధించగలవా లేదా అనేది మరికొన్ని వారాల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే.. అమెరికా అంటువ్యాదుల నిపుణుడు డా. ఆంథోనీ ఫౌచీ సోమవారం కరోనా కొత్త స్ట్రెయిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొవిడ్-19 కొత్త స్ట్రెయిన్ ఇప్పటికే అమెరికాలో కూడా ప్రవేశించి ఉండొచ్చని అన్నారు. మొదట దీనిని నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో యూకే నుంచి చాలా దేశాలు రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. భారత్ కూడా యూకేకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. మంగళవారం అర్థరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది.         


"ఇప్పటివరకు మా వద్ద ఉన్న డేటా ప్రకారం ఇటీవల యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌ను కూడా ఎదుర్కొనే ఇమ్యూనిటీని మోడెర్నా వ్యాక్సిన్ ఇవ్వగలదని మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లోనే అదనపు పరీక్షలు నిర్వహించబోతున్నాం." అని మోడెర్నా సంస్థ ప్రతినిధితులు ప్రకటించారు. అలాగే ఫైజర్ కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తపు నమూనాలు సేకరించి.. ఈ టీకా వారిలో ఎలా రోగనిరోధకతను కలిగిస్తోందో ఆ డేటాను పరిశీలిస్తోందని సమాచారం. దీని ప్రకారం కొత్త స్ట్రెయిన్‌ను సైతం ఈ టీకా న్యూట్రలైజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందో లేదో పరీక్షించనుందట. 

Updated Date - 2020-12-22T21:41:17+05:30 IST