విదేశాల నుంచి వచ్చి.. క్వారంటైన్‌కు వెళ్లకుండా..

ABN , First Publish Date - 2020-03-23T12:36:05+05:30 IST

విదేశాల నుంచి వచ్చి ఎయిర్‌పోర్టులో క్వారంటైన్‌ ముద్ర వేయించుకున్న వారు కొందరు జనసమూహంలోకి వెళ్లిపోతున్నారు.

విదేశాల నుంచి వచ్చి.. క్వారంటైన్‌కు వెళ్లకుండా..

స్టాంప్‌ చూసి పట్టిస్తున్న జనం

కర్ఫ్యూ రోజు పలు ఘటనలు

(న్యూస్‌నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి వచ్చి ఎయిర్‌పోర్టులో క్వారంటైన్‌ ముద్ర వేయించుకున్న వారు కొందరు జనసమూహంలోకి వెళ్లిపోతున్నారు. వారి చేతులపై స్టాంప్‌లను కొందరు గుర్తించి పోలీసులకు పట్టిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాకినాడ రైలు ఎక్కింది. తోటి ప్రయాణికురాలి ఫిర్యాదుతో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు  ఆమెను బంధువుల ఇంటికి పంపించేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైద్యపరీక్షల అనంతరం ఆమెకు క్వారంటైన్‌ స్టాంప్‌ వేశారు. అక్కడ నుంచి నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లి కాకినాడ రైలు ఎక్కడంతో కలకలానికి దారితీసింది. దుబాయి నుంచి వచ్చిన మరో నలుగురు యువకులు హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు వద్ద కనిపించారు.


నిజామాబాద్‌ వెళ్లేందుకు బస్సుల కోసం కొన్ని గంటల సేపు అక్కడే వేచి చూశారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలకేంద్రంలో ఓ లాడ్జిలో ఇటలీ దంపతులు రెండు రోజుల పాటు బస చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐను యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్‌లో ఆదివారం దింపేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆ యువకుడు ఆస్ర్టేలియా నుంచి వచ్చినట్టు తెలిసింది. ఖతర్‌ నుంచి వచ్చి స్వీయనిర్బంధం పాటించకుండానే అదృశ్యమైన వ్యక్తిపై, అతని బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-03-23T12:36:05+05:30 IST