విమానంలో రచ్చ రచ్చ చేసిన యువతికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

ABN , First Publish Date - 2020-02-13T03:10:48+05:30 IST

విమానం ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన యువతికి లండన్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.

విమానంలో రచ్చ రచ్చ చేసిన యువతికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

లండన్: జెట్2 విమానం ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన యువతికి లండన్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్లో హెయిన్స్(26) అనే యువతి మద్యం మత్తులో విమానం 30 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఎగ్జిట్ డోర్‌, మెయిన్ డోరో‌ను తెరిచేందుకు ప్రయత్నించింది. అడ్డొచ్చిన ప్రయాణికులను, విమాన సిబ్బందిపై దాడి కూడా చేసింది. దీంతో విమానంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎట్టకేలకు విమాన సిబ్బంది, ప్రయాణికులు యువతిని నిలువరించగలిగారు. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారాన్ని అందించి విమానాన్ని స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండ్ చేశాడు. 


స్టాన్‌స్టెడ్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమానం యువతి కారణంగా తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది. అనంతరం యువతిని ఎయిర్‌పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఏం జరిగిందో కూడా తనకు గుర్తులేదంటూ యువతి అధికారులకు చెప్పుకొచ్చింది. తన మెడికేషన్‌లో మద్యం కలవడంతో తాను ఈ విధంగా ప్రవర్తించినట్టు తెలిపింది. గతేడాది జూన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతూ వస్తుండగా.. మంగళవారం కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చింది.

Updated Date - 2020-02-13T03:10:48+05:30 IST