లాక్‌డౌన్ కంటే పేదరికం, ఆకలితో ఎక్కువ బాధపడుతున్నారు: ఇమ్రాన్ ఖాన్
ABN , First Publish Date - 2020-05-17T06:48:20+05:30 IST
కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్ కంటే పేదరికం, ఆకలితో ఎక్కువ మంది

ఇస్లామాబాద్: కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్ కంటే పేదరికం, ఆకలితో ఎక్కువ మంది బాధపడుతున్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలు, ఆర్థిక సమస్యల మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యమని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 38,799 కరోనా కేసులు నమోదుకాగా.. 834 మంది మరణించారు. పాకిస్థాన్‌లో కరోనా కేసులు 36 వేలు దాటడంతో ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన శనివారం నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్(ఎన్‌సీఓసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులపై ఇమ్రాన్ ఖాన్ చర్చించారు. ప్రజలు పడుతున్న సమస్యలను దృష్టిలోకి తీసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ సౌకర్యాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ తయారై ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడు ప్రశాంతంగా నిద్రపోలేరని పేర్కొన్నారు. కాగా.. రవాణా రంగం, షాపింగ్ ప్లాజాలను పునరుద్దరించే అంశంపై చర్చ జరిగినప్పటికి.. ఇమ్రాన్ ఖాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.