హెయిర్ కటింగ్ కోసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం..!
ABN , First Publish Date - 2020-05-18T01:43:01+05:30 IST
కరోనా వైరస్ వల్ల.. ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో హెయిర్ కట్ కోసం వ్యక్తి దాదాపు వెయ్యి కిలోమీటర్ల (647మైళ్ల) దూరం ప్రయాణించిన

వాషింగ్టన్: కరోనా వైరస్ వల్ల.. ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో హెయిర్ కట్ కోసం వ్యక్తి దాదాపు వెయ్యి కిలోమీటర్ల (647మైళ్ల) దూరం ప్రయాణించిన ఘటన అమెరికాలో చోటుచోసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తుండటంతో అక్కడ వ్యాపార సముదాయాలు, సెలూన్‌లు, రెస్టారెంట్‌లు తదితరాలన్నీ మూతపడ్డాయి. అమెరికా వ్యాప్తంగా డిజాస్టర్ డిక్లరేషన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన జె ఫార్(28) అనే యువకుడు.. వాషింగ్టన్‌లోని ఒలింపియాలో లాక్ అయిపోయాడు. సాధారణంగా ప్రతి రెండు, మూడు వారాలకు ఒకసారి హెయిర్ కట్ కోసం సెలూన్‌కు వెళ్లే జె ఫార్.. లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలలపాటు అటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే తన హోం టౌనుకు చెందిన స్నేహితుడొకరు హెయిర్ కట్ చేయించుకున్నట్లు ప్రకటించడంతో ఉన్నపలంగా కాలిఫోర్నియాలోని యూబా సిటీకి బయల్దేరిపోయాడు. ఒలింపియా నుంచి దాదాపు 1041 కిలోమీటర్లు ప్రయాణించి యూబా సిటీకి చేరుకున్న జె ఫార్.. చివరికి కటింగ్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా అంకౌట్లలో పోస్ట్ చేశాడు.
కాగా.. కాలిఫోర్నియా రాష్ట్ర వ్యాప్తంగా స్టే హోం ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల మార్గదర్శకాల ప్రకారం.. యూబా సిటీలోని సెలూన్‌లు తెరుచుకున్నాయి. దీంతో చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు.. ఎయిర్ కట్ కోసం యూబా సిటీకి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే కాలిఫోర్నియాలో దాదాపు 78వేల మంది కరోనా బారినపడగా.. 3వేల మంది మరణించారు.