పర్యాటకుల విషయంలో ఒమన్ మరో కీలక నిర్ణయం !
ABN , First Publish Date - 2020-12-11T13:41:08+05:30 IST
గల్ఫ్ దేశం ఒమన్ పర్యాటకుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
క్వారంటైన్, ప్రీ-ఫ్లైట్ పీసీఆర్ టెస్టు నుంచి మినహాయింపు
మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ పర్యాటకుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ సందర్శకులకు క్వారంటైన్, ప్రీ-ఫ్లైట్ పీసీఆర్ టెస్టు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం పర్యాటకుల కోసం కొత్త ప్రయాణ మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. “పర్యాటకులు ఒమన్ చేరుకోవడానికి ముందు పీసీఆర్ పరీక్ష చేయించుకోవలసిన అవసరం లేదు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం తప్పకుండా పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి” అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఇక ఇటీవల ఒమన్ 103 దేశాల పౌరులకు 'వీసా ఫ్రీ' ఎంట్రీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అలాగే 'వీసా ఫ్రీ' ఎంట్రీ ద్వారా వచ్చిన పర్యాటకులకు 10 రోజుల పాటు దేశంలో స్టే చేసే వెసులుబాటు కూడా ఇచ్చింది. అయితే, సందర్శకులు తప్పనిసరిగా హోటల్ రిజర్వేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, రిటర్న్ టికెట్ కలిగి ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. కాగా, 103 దేశాల పౌరులు వీసా లేకుండా ప్రవేశించడానికి అనుమతించే ప్రకటనను అనుసరిస్తూ తాజాగా క్వారంటైన్, ప్రీ-ఫ్లైట్ పీసీఆర్ టెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది ఒమన్ పర్యాటక శాఖ. ఇక కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న టూరిజం రంగాన్ని ఊతం ఇచ్చేందుకే ఒమన్ సర్కార్ ఇలా పర్యాటకుల విషయంలో పలు వెసులుబాటులతో ముందుకెళ్తోంది.