అన్నార్తుల ఆకలి తీర్చుతున్న నాట్స్, మన్నవ ట్రస్టు

ABN , First Publish Date - 2020-05-09T00:29:19+05:30 IST

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది నిరుపేదలకు తిండి దొరకటమే కష్టంగా మారింది. ఈ కష్ట సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్‌లు ముందుకొచ్చాయి.

అన్నార్తుల ఆకలి తీర్చుతున్న నాట్స్, మన్నవ ట్రస్టు

ట్రస్ట్ తరపున గుంటూరులో 800 మందికి ఆహారం

గుంటూరు, మే 7: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది నిరుపేదలకు తిండి దొరకటమే కష్టంగా మారింది. ఈ కష్ట సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్‌లు ముందుకొచ్చాయి. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు ఆహారపొట్లాలు, నిత్యావసర వస్తువులను అందజేస్తున్నాయి.


ఈ క్రమంలోనే గుంటూరులోని వరలక్ష్మి ఓల్డేజ్ హోమ్, నర్సిరెడ్డి ఓల్డేజ్ హోమ్, విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో నిత్యావసరాలు, ఆహార పొట్లాలను అందించారు. దాదాపు 800 మందికి ఇలా నిత్యావసరాలు, ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ఇంకా అత్యంత నిరుపేదలు ఉన్న ప్రాంతాల్లో తాము నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతున్నామని నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్టులు ప్రకటించాయి.


గుంటూరులో పేదలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్‌తో పాటు తన ట్రస్ట్ ద్వారా ఈ నిత్యావసరాల పంపిణీకి పూనుకున్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు మోహనకృష్ణ మన్నవను వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.


ఈ పంపిణీ కార్యక్రమంలో మన్నవ ట్రస్ట్ ప్రతినిధులు స్వరూప్, సంతోష్, సాయినాథ్, చైతన్య, అంబ్రేష్, చిన్ను, ఈశ్వర్, ఎం.కె, సికెరావు, తేజ, బాజీ, సందీప్, సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-09T00:29:19+05:30 IST